calender_icon.png 31 October, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమకొండ మళ్లీ మునిగిపోయింది

30-10-2025 10:56:02 PM

రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం.!

“రూ.100 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రెయిన్ వృథా – వినయ్ భాస్కర్, కేటీఆర్ ల మోసం బహిర్గతం!”

మళ్లీ అదే కాలనీలు మునిగాయి – సీఎం, మేయర్, అధికారుల నిర్లక్ష్యం స్పష్టమైంది!”

హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ వరంగల్ ప్రాంతాలు మళ్ళీ జలమయమయ్యాయని, వాటికి కారణం పాలకుల నిర్లక్ష్యమేనని సంతోష్ రెడ్డి విమర్శించారు. గురువారం బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి నగర్, సప్తగిరి కాలనీ, టీజీఎన్‌ఓ కాలనీ, సమ్మయ్య నగర్, హంటర్ రోడ్, హనుమకొండ చౌరస్తా, అలంకార్ జంక్షన్ తదితర 100కు పైగా కాలనీలు వరద నీటిలో మునిగి పోయాయని, ప్రజలు భవనాలపై అంతస్తుల్లో, టెర్రస్‌లపై సహాయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. నీరు ఇళ్ల మొదటి అంతస్తు వరకు చేరాయిని, అమరావతి నగర్‌లో రూ.100 కోట్లు ఖర్చుతో చేసిన అండర్ డ్రెయిన్ టన్నెల్ పనికిరాలేదు ఇది పూర్తిగా వృధా అయింది.

ఈ ప్రాజెక్ట్‌ కేవలం అప్పటి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మరియు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడానికే చేయబడిందని ఘాటుగా విమర్శించారు. అప్పటి మంత్రి కేటీఆర్ స్వయంగా హామీ ఇచ్చి హనుమకొండలో ఇక వరదలు రావు అన్నారు, కానీ ఆ హామీ కూడా వృథా అయింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తూ కేవలం ఓట్లు కోసమే తప్పుడు హామీలు ఇస్తున్నాయని ఆయన అన్నారు. హనుమకొండలో నిజమైన అభివృద్ధి సాధ్యమయ్యేది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అమృత్ పథకం ద్వారానే అని పేర్కొన్నారు.వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఇక రోడ్లపై నీరు కనిపించదు అని చెప్పిన వీడియో ఇప్పుడు ప్రజల చేత సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతోందని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్నా, హనుమకొండ–వరంగల్ అభివృద్ధి దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదని, కేవలం హైదరాబాద్ మీదే దృష్టి పెట్టారని విమర్శించారు.  ఆయన శుక్రవారం వరంగల్‌ కి వస్తున్న నేపథ్యంలో, ప్రజలకు ఏం ఇవ్వబోతున్నారు? కనీసం హనుమకొండ పునరుద్ధరణకు ఏదైనా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. మేయర్, మున్సిపల్ అధికారులు స్టడీ టూర్లకు వెళ్ళి ప్రజల డబ్బు వృధా చేస్తున్నారు, కానీ ఫలితం మాత్రం శూన్యం అన్నారు. ప్రతిసారి ఇదే ప్రాంతాలు వరదలో మునుగుతున్నా, ప్రభుత్వానికి ముందస్తు చర్యల ఆలోచనే లేదని మండిపడ్డారు. కంట్రోల్ రూమ్ హెల్ప్‌లైన్ నంబర్లు కూడా పనిచేయడం లేదని విమర్శించారు. 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇద్దరూ ప్రజలను మోసం చేశారని అన్నారు. హనుమకొండ–వరంగల్ అభివృద్ధికి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని, ప్రజలకు నిజమైన ఆశ బీజేపీ ప్రభుత్వమే అని సంతోష్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ మోర్చా నాయకుడు నాను నాయక్ , ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సండ్ర మధు, జిల్లా కార్యదర్శి కుతురు రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు గొర్రె ఓం ప్రకాష్ , మాజీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు రాజి రెడ్డి, అరణ్య రెడ్డి, విభాగ అధ్యక్షులు అదేపు రాజు, రేవంత్, జితేందర్, మూల రాము గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.