22-09-2025 12:03:44 AM
మండల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు మార్లు సాయిబాబు
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): నకిలీ లేబర్ కార్డులపై ఉద్యమం చేపడుతామని మండల భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు మార్లు సాయిబాబు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి లో భవన కార్మిక సంగం లో సమావేశం నిర్వహించారు.
నెలవారీ అమావాస్య సెలవు సందర్భంగా ఎల్లారెడ్డి మండల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు మహామేస్త్రి మార్లు సాయిబాబు ఆధ్వర్యంలో ముఖ్య భవన ననిర్మాణకార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొన్ని విషయాలపై చర్చించి, నకిలీ లేబర్ కార్డులు తొలగించకపోతే మండల వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మహామేస్త్రి మార్లు సాయిబాబు హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తున్నందున ప్రతి నిజమైన కార్మికుడు తప్పనిసరిగా లేబర్ కార్డు కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. నకిలీ లేబర్ కార్డుల వల్ల నిజమైన కార్మికులు నష్టపోతున్నారని, ఈ దందాను నిర్మూలించేందుకు మండల వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని సూచించారు.
నిర్మాణ రంగంలో కష్టజీవులైన నిజమైన కార్మికులు లేబర్ కార్డు పొందేందుకు రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, బ్యాంక్ పాస్బుక్, రెండు ఫోటోలు, ఈశ్రమ్ కార్డ్ పలు నకలు కాపీలను తీసుకువచ్చి సంఘం కార్యాలయంలో నమోదు చేసుకోవాలని తెలిపారు. అలాగే, మండలంలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేయాలని, తొందరగా పూర్తి అయితే గృహ యజమానులు సంతోషంగా ఉంటారనీ ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి దుర్గాసింగ్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి కాంతారావు, కార్యదర్శి గణేష్, ప్రచార కార్యదర్శి కరీం, సీనియర్ మాజీ అధ్యక్షులు అవిటి బాబు, మాజీ అధ్యక్షులు శ్యామ్, సలహాదారులు పోచయ్య, రామ్మోహనరావు, ప్రతాప్ రాజు, సత్యనారాయణ, గోపాల్, మైపాల్ తదితరులు పాల్గొన్నారు.