22-12-2025 01:53:57 AM
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఫైర్
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: అస్సాం ప్రజలకు భద్రత కల్పించలేకే ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేసి, తమపై బురద జల్లుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ప్రస్తుతం బీజేపీయేనని, దశాబ్దం నుంచి కేంద్రంలోనూ వారి పాలనే నడుస్తున్నదని గుర్తుచేశారు. ఆ రాష్ర్ట ప్రజలకు భద్రత కల్పించడంలో విఫలమైతే అందుకు ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వమే బాధ్యత వహించాలని నిప్పులు చెరిగారు. అక్కడ కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు, చొరబాటుదారులను అడ్డుకోలేకపోవడానికి ప్రతిపక్షాలను బాధ్యులను చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. అసోం పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పాలనపై చేసిన వ్యాఖ్యలపై ఖర్గే స్పందించారు. అస్సాం అభివృద్ధి పట్టించుకోలేదనే ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టారు.