08-07-2025 01:41:37 AM
కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్), జులై 7 (విజయక్రాంతి): ఇసుక అక్రమ రవాణాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో రెవెన్యూ, టిఎస్‌ఎండిసి, ఇరిగేషన్, పోలీస్, రవాణా, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, భూగర్భ జల శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందించాలన్నారు. ఉచిత ఇసుక రవాణాలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లాలోని ఇసుక రీచ్ లను గుర్తించి జియో ట్యాగింగ్ చేయాలని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్న లబ్ధిదారులకు ఇసుకను అందించేందుకు రవాణా జరిగే కిలోమీటర్ల దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలను నిర్ణయించాలని తెలిపారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఇసుక రీచ్ ల అనుమతుల కోసం నివేదికలు అందించాలని సూచించారు.
అనంతరం మన ఇసుక వాహనం మొబైల్ యాప్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను అధికారులతో కలిసి పరిశీలించి మన ఇసుక వాహనం అనే మొబైల్ యాప్ తీసుకురావడం వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, టి ఎస్ ఎం ఐ డి సి, ఇరిగేషన్ పోలీస్, రవాణా, పంచాయతీరాజ్, భూగర్భ జల శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.