26-05-2025 01:34:46 AM
సంగారెడ్డి, మే 25(విజయక్రాంతి):బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు భారీగా తగ్గాయి. గతేడాదితో పోల్చితే క్వింటాలుకు రూ.800 నుంచి రూ.1,600 వరకు తగ్గుముఖం పట్టాయి. రాష్ట ప్రభుత్వం రేషన్ ద్వారా పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. లబ్దిదారులు వీటిని సద్వినియోగం చేసుకుంటుండగా..
మార్కెట్లో ధరలు దిగొస్తున్నాయి. గిరాకీ లేక దుకాణాలు వెలవెల పోతున్నాయి. మరోవైపు ఈ స్థాయిలో ధరలు పడిపోవడం ఇదే తొలిసారి అని వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.
ఇదీ పరిస్థితి...
రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా పేదలకు ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించింది. తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని ఒక్కో వ్యక్తి ఆరు కిలోల చొప్పున ఉచితంగా అందజేస్తోంది. ఈ బియ్యం నాణ్యతతో ఉండటంతో లబ్దిదారులు వాటిని తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకటో తారీకు వచ్చిందంటే చాలు రేషన్ షాపుల వద్ద బారులు తీరి మరీ తెచ్చుకుంటున్నారు.
నెల మొదటి వారంలోనే 80 శాతం పంపిణీ పూర్తవుతుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సన్నరకాల వడ్లసాగును ప్రోత్సహిస్తోంది. రైతులకు క్వింటాలు రూ.500 బోనస్ సైతం చెల్లిస్తోంది. తద్వారా సన్నాల దిగుబడి పెరిగింది. దీంతో ఇటు ప్రభుత్వం, అటు డీలర్లు పోటీపడీ సన్నబియ్యం కొనగోలు చేస్తున్నారు.
ఈ క్రమంలో సన్నబియ్యం సరఫరా పెరిగిపోయింది. అయితే రేషన్ పంపిణీ కారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు మార్కెట్లో బియ్యం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. చేసేది లేక వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే క్వింటాల్కు పాతవి రూ.800 నుంచి రూ.1600 వరకు, కొత్తవి రూ.1,350 నుండి రూ.1,700 మేర ధర తగ్గడం గమనార్హం.
తగ్గిన కొనుగోళ్లు...
గత ప్రభుత్వ హయాంలో తెల్లరేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. దీంతో లబ్దిదారులు వాటిని తినలేక రేషన్ డీలర్లకు తక్కువ ధరకు అమ్ముకుని మార్కెట్లో సన్నబియ్యం కొనుగోలు చేసేవారు. గతేడాది ప్రీమియం రకం ( పాతవి) క్వింటాల్కు రూ.5,300 నుంచి నుంచి రూ. 6900 వరకు పలకగా.. ప్రస్తుతం ఇవి రూ.4.300 నుంచి రూ.6,100 వరకు లభిస్తున్నాయి.
అలాగే కొత్తవి రకాన్ని బట్టి గతంలో రూ.5 వేల నుంచి రూ.6,500 వరకు ధర పలకగా.. ప్రస్తుతం రూ.3,700 నుంచి రూ.5,250 వరకు విక్రయిస్తున్నారు. ధరలు తగ్గినా కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో ఉండకపోవడంతో జిల్లాలోని బియ్యం విక్రయ దుకాణాలు వెలవెలబోయి దర్శనమిస్తున్నాయి.
పంట దిగుబడి పెరగడంతోనే..పంకజ్, బియ్యం వ్యాపారి, ఇంద్రేశం
రాష్ట్రంలో సన్నరకం వడ్ల సాగు గణనీయంగా పెరిగింది. దిగుబడి కూడా అధికమైంది. దీనికి తోడు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సర ఫరా చేస్తోంది. గతంలో చాలా మంది రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం అమ్ముకొని సన్న బియ్యం కొనుక్కునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీంతో బియ్యం ధరలు మార్కెట్ లో గణనీయంగా పడిపోయాయి. షాపుల కిరాయిలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే కొనసాగితే దుకాణాలు మూసేయాల్సిందే.