calender_icon.png 26 May, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంత నిధులతో ఇంద్రేశం రోడ్డుకు మరమ్మతులు

26-05-2025 01:32:54 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

పటాన్చెరు, మే 25: ఇంద్రేశం - దౌల్తాబాద్ రహదారి పూర్తిస్థాయి మరమ్మతుల కోసం త్వరలోనే నిధులు మంజూరు కానున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఇంద్రేశం చౌరస్తా వద్ద పూర్తిస్థాయిలో ధ్వంసమైన రహదారిని ఎమ్మెల్యే జిఎంఆర్ పరిశీలించారు. ఇంద్రేశం రోడ్డు దుస్థితిపై ఈనెల 23న అమ్మో...ఇంద్రేశం రోడ్డు అనే శీర్షికన కథనాన్ని ప్రచురించింది.

ఈ కథనానికి ఎమ్మెల్యే జీఎంఆర్ స్పందిస్తూ సొంత నిధులతో రోడ్డు మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. వర్షాకాలంలో వాహనాలు వెళ్లేందుకు.. ప్రజలు నడిచేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు, ప్రజాప్రతినిధులు ఇటీవల తన దృష్టికి తీసుకొని రావడం జరిగిందని ఆయన తెలిపారు. వెంటనే సొంత నిధులతో ఇంద్రేశం చౌరస్తా వద్ద రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించామని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరు పట్టణానికి ఇంద్రేశంతో పాటు రామేశ్వరం బండ, పెద్దకంజర్ల, చిన్నకంజర్ల, ఐనోలు, బచ్చుగూడెం, పోచారంతో పాటు నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు ఈ రహదారినే వినియోగిస్తారని తెలిపారు. గతంలో ఇంద్రేశం నుండి పెద్దకంజర్ల వరకు 22 కోట్ల రూపాయలతో రహదారి విస్తరణ పనుల కోసం నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు.

అనివార్య కారణాల వల్ల విధుల కేటాయింపు రద్దు కావడం మూలంగా తిరిగి రహదారి వరమ్మత్తులు చేపట్టాలని ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు. తాత్కాలిక మరమ్మత్తుల కోసం ప్రభుత్వం 50 లక్షల రూపాయల నిధులు కేటాయించగా.. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేవని తెలిపారు. తక్షణ మరమ్మతుల కోసం సొంత నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు.

త్వరలోనే మరోమారు ప్రభుత్వంతో చర్చించి పూర్తిస్థాయిలో రహదారి విస్తరణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. బీరంగూడ - కిష్టారెడ్డిపేట రహదారి విస్తరణ చేపట్టిన విధంగా ఇంద్రేశం నుండి పెద్దకంజర్ల వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని తెలిపారు.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ లాలు నాయక్, మాజీ ప్రజాప్రతినిధులు నర్సింలు, అంతిరెడ్డి, బండి శంకర్, శివారెడ్డి, రామచందర్, తదితరులుపాల్గొన్నారు.