- యువతకు ఉపాధి కల్పించే విధంగా నల్లమల్ల అభివృద్ధి
- మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహా
నాగర్‌కర్నూల్, జూలై 5 (విజయక్రాంతి): వన్యప్రాణులు, శైవక్షేత్రాలు, జలపాతాలకు ఆలవాలమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఎకో టూరిజానికి ప్రాధాన్యమిస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని రంగాపూర్, ఉమామహేశ్వర దేవస్థా నాలు, నిరంజన్ షావలి దర్గాను శుక్రవారం వారు దర్శించుకున్నారు. అనంతరం అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో వన మహో త్సవంలో భాగంగా అధికారులు, విద్యార్థులతో కలిసి 350 మొక్కలు నాటారు.
అటవీ ప్రాంతంలోని బౌరాపూర్ పెంట వరకు జంగల్ సఫారీ చేశారు. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ.. యువతకు ఉపాధి కల్పించే విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. విదేశీయులను ఆకర్షించేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామన్నా రు. రాష్ట్రానికి పురాతన సంపద, కళలు వారసత్వంగా ఉన్నాయన్నారు. పర్యాటక, ఫారెస్ట్ శాఖలు సంయు క్తంగా పీపీపీ పద్ధతిలో ఫారెస్ట్ ఆదాయాన్ని పెంచే విధంగా పనిచేయాలన్నారు.
పర్యటనలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, వాకిటి శ్రీహరి, రాజేష్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డో బ్రియల్, పర్యాటక పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్‌రెడ్డి ఉన్నారు.
టూర్‌పై విమర్శలు
వన్యప్రాణుల సంతతి పెంచుకునేందుకు అనుకూలమైన సమయం కావడంతో అటవీశాఖ ఇటీవల మూడు నెలల పాటు అటవీప్రాంతంలో ప్రవేశాన్ని నిషేధించిన సంగతి విదితమే. ఆ నిషేధాజ్ఞలను ఉల్లంఘించేలా రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్యారోగ్యశాఖ మంత్రి దామో దర రాజనర్సింహా కాంగ్రెస్ నేతలతో స్టడీ టూర్ పెట్టుకోవడం విమర్శల కు తావిస్తోంది. వన్యప్రాణి రక్షణ చట్టా న్ని పాటిస్తున్నామని, అందుకే మీడియాను సైతం శుక్రవారం అనుమతించలేదని చెప్తున్న మంత్రులు కానీ పార్టీ నాయకులను ఎందుకు సఫారీకి ఆహ్వానించారో చెప్పాల్సిన అవసరం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా శనివారమూ టూర్ కొనసాగనున్నది.