19-05-2025 04:46:54 PM
జిల్లా వైద్యాధికారి డాక్టర్
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ నిర్వాహణలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్(Medical Officer Dr. Ravi Rathod) అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులను సోమవారం జిల్లా వైద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ 2010 నిబంధనలను అనుసరించి వైద్య సేవలకు నిర్ణీత రుసుములను తీసుకోవాలని, చార్జీల వివరాల పట్టికను అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఫైర్ సేఫ్టీకి సంభందించిన పరికరాలను అమర్చుకోవాలని, బయో మెడికల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారు ఇచ్చే సర్టిఫికేట్ లను విధిగా తీసుకోని, అందరికీ కనిపించే విధముగా ప్రదర్శించాలని పేర్కొంటూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ 2010 నిబంధనలను ఉల్లంగించినట్లైతే అట్టి ఆసుపత్రులకు షో కాజ్ నోటీసులను జారీ చేసి, వారి అనుమతి అనుమతి పత్రాలను రద్దు చేయడం, అపరాధ రుసుములను విధిస్తామని హెచ్చరించారు.
స్కానింగ్ సెంటర్లలలో లింగ నిర్ధారణ పరీక్షలు అనుమతి పొందిన రేడియాలజిస్టులు, గైనకాలజిస్ట్ లు మాత్రమే గర్భవతులకు స్కానింగ్ చేయాలని, స్కానింగ్ చేసిన తర్వాత ఆడ, మగ అని తెలుపుట చట్టరీత్యా నేరమని పేర్కొంటూ అన్ని స్కానింగ్ సెంటర్లలో స్కానింగ్ చేసే గదిలో, వేచియుండు హాలులో తప్పకుండా ఇక్కడ లింగ నిర్ధారణ చెప్పబడదు అనే బోర్డు విధిగా పెట్టాలని, ఫామ్ ఎఫ్ అన్నీ ప్రతినెల 5వ తారీఖు లోపు జిల్లా వైద్య’ ఆరోగ్య శాఖా కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఫామ్ ఎఫ్ లను జాప్యం చేయకుండా అదే రోజు ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ సారంగం, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, హెచ్‌ఈఓ లోక్య, అరుణ్ మనోహర్, సిసి అనిల్ పాల్గొన్నారు.