calender_icon.png 30 September, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

30-09-2025 02:03:33 AM

  1. ప్రజావాణి అర్జీలపై నిర్లక్ష్యం వద్దు 
  2. బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దు
  3. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్  

హైదరాబాద్,సిటీ బ్యూరో సెప్టెంబర్ 29 (విజయక్రాంతి):ప్రభుత్వ సేవలు, పౌర సమస్యలపై ప్రజల నుంచి అందే వినతులను తక్షణమే పరిష్కరించాలని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. ఒకే సమస్య కోసం బాధితులు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత అధికా రులదేనని ఆయన స్పష్టం చేశారు.

సోమవారం జీహెఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరై, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు.ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన కమిషనర్, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. శాఖాధిపతులు తమ పరిధిలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, అవి పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.

కాగా జీహెఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 37 వినతులు అంద గా, అందులో అత్యధికంగా టౌన్ ప్లానిం గ్ విభాగానికి 21 ఫిర్యాదులు రావడం గమనార్హం.   ఇంజనీరింగ్ విభాగానికి 7, ఆస్తిప న్ను విభాగానికి 5 ఫిర్యాదులు అందాయి. విజిలెన్స్, హెల్త్ అండ్ శానిటేషన్, యూబీడీ, సీటీఓ విభాగాలకు ఒక్కొక్కటి చొప్పున ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇదిలా ఉండ గా, జీహెఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మరో 55 అర్జీలు స్వీకరించారు.

వీటిలో కూకట్‌పల్లి జోన్‌లో అత్యధికంగా 28 వినతులు రాగా, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్ జోన్లలో తలా 9, చార్మినార్ జోన్‌లో 5, ఎల్బీనగర్ జోన్‌లో 4 ఫిర్యాదులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్, సత్యనారాయణ, వేణు గోపాల్, అలివేలు మంగతాయారు, విజిలెన్స్ డీఎస్పీ నర్సింహా రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.