24-01-2026 12:00:00 AM
ఆచార్య మసన చెన్నప్ప :
* డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి సేవా కార్యక్రమాలంటే ఎంతో ఇష్టం. తాను సంపాదించిన ధనంలో కొంత సేవా కార్యక్రమాలకు వినియోగించడం ఆయన దృక్పథాన్ని తెలియజేస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే గొప్పవాడు. లక్ష్మీనారాయణ వీలు దొరికినప్పుడు పాటలు రాస్తాడు.
కొందరెట్లా పరిచయమవుతారనేది అసలు ఊహించలేము. భువనగిరిలో జరిగిన ఒక సాహిత్యసభకు నేను ఒకసారి వెళ్లాను. ఆ సభలో నాకు పరిచయమైన వ్యక్తే కస్తూరి లక్ష్మీ నారాయణ గారు. ఈయన వృత్తిరీత్యా ఒక డాక్టరు. ఇక ప్రవృత్తి రీత్యా మంచి రచయిత. పాటలు అల్లగలడు, తనదైన శైలిలో పాడి అందరినీ మెప్పించగలడు. అయితే నాకెంతో మంది డాక్టర్లతో పరిచయం! అందరూ నా ఆరోగ్యాన్ని గూర్చి పట్టించుకోరు. కాని వారిలో కొందరున్నారు. నన్ను రోజు తప్పి రోజు పరామర్శిస్తారు.
సూచనలు, సలహాలు ఇ స్తుంటారు. అయితే వారిలో నన్ను పరీక్షించి, అవసరమైన మందులు ఉచితంగా ఇచ్చేవారు మాత్రం డాక్టర్ లక్ష్మీనారాయణ గారే. కొంతమంది డాక్టర్లకు పేషెంట్ల ముఖం చూ స్తే వారి ఆరోగ్య పరిస్థితి తెలుస్తుంది. కొందరికి చెయ్యి చూస్తే తెలుస్తుంది. మరికొందరికి మాట్లాడితే తెలుస్తుంది. అయితే నేను ఎప్పు డు ఫోన్‌లో మాట్లాడినప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని ఇట్లే పట్టేసే సామర్థ్యం డాక్టర్ లక్ష్మీనారాయణగారిది. అది వారికి వారి నాన్న గారి నుంచి అబ్బింది. అది 2020వ సంవత్సరం. కరోనా ఇంకా వ్యాపించలేదు.
నేను యథాలాపంగా శ్రావణిని చూడడానికి అమెరికా వెళ్తున్నానని డాక్టర్ లక్ష్మీనారాయ ణ గారితో అన్నాను. ఇంకో నాలుగు రోజులకు విమానం ఎక్కుతాననగా డాక్టర్ లక్ష్మీ నారాయణ గారు నాకు ఒక బాక్సును పం పించినారు. ఆ బాక్సు నిండా వివిధ రకాల మందులు ఉండడం నాకు ఆశ్చర్యం కలిగించింది. సాధారణంగా వచ్చే, జ్వరం, జలుబు, దగ్గు, అరుచి, వేడి, సర్ది, తలనొప్పి, అజీర్ణం, బలహీనత, వాతం మొదలైన వాటిని నివారించడానికి అవసరమైన మందులను బాక్సులో వేర్వేరుగా లేబుల్స్ అంటించి పంపించారు డాక్టరు లక్ష్మీనారాయణగారు.
ఇన్ని మందులెందుకు?
‘డాక్టర్ గారూ! ఎందుకండీ ఇన్ని మందు లు నాకు మూటగట్టి పంపారు?’ అని నేనడిగాను. అప్పుడు వారన్నారు..‘అమెరికాలో మందులుంటాయి. కానీ మనకందుబాటు లో ఉండవు. ప్రిస్క్రిప్షన్ ఉంటే గాని ఏ షాపువాడు మందులివ్వడు. అందుకే ముందు జా గ్రత్తగా మనం వెంట మందులుంచుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు కదా. అందుకే పం పాను’ అని పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే నేను అమెరికాలో ప్రవేశించిన తర్వాత ప్రపంచమంతటా కరోనా విలయతాండవం చేసింది. దీంతో నేను దినదినగండంగా కా లం గడపవలసివచ్చింది. బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
ఆర్నెల్ల పాటు ధైర్యంగా ఉండడానికి డాక్టర్ లక్ష్మీనారాయణగారిచ్చిన బాక్సు నాకు ఎంతగానో ఉపయోగపడింది. లక్ష్మీనారాయణ గారు ఇచ్చిన మందుల వల్ల ఒక డాక్టర్ స్వయంగా నా దగ్గరున్నంత అనుభూతి కలిగిందనడంలో అతిశయోక్తి లేదు. డాక్టర్ లక్ష్మీనారాయణగారు చేసిన ఈ సహాయానికి అమెరికా నుంచి ఎన్నోసార్లు కృత జ్ఞతలు చెప్పాను. పరిస్థితులు సద్దుమణిగిన ఆర్నెళ్ల తర్వాత నేను క్షేమంగా హైదరాబాదుకు వచ్చాను. ఆ తర్వాత వెంటనే స్వయంగా డాక్టర్ లక్ష్మీనారాయణగారిని ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు చెప్పాను.
వీరవల్లిని ధీరవల్లిగా..
డాక్టర్ లక్ష్మీనారాయణ గారిది యాదాద్రి జిల్లాలోని వీరవల్లి అనే గ్రామం. వీరవల్లిని ధీరవల్లిగా మార్చిన గౌరవం లక్ష్మీనారాయ ణ గారికి దక్కింది. స్వగ్రామంలో ఒక క్లీనిక్కును ఏర్పాటు చేసి, గ్రామ వాసులకు వైద్య సహాయం చేసేవారు. గ్రామంలో శిథిలమైన శివాలయాన్ని పునరుద్ధరించి గ్రామస్థులందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇక వీరవల్లికి సమీపంలో వృద్ధులకు ‘మాతృ పితృ ధ్యాన మందిరం’ నెలకొల్పినారు.
ప్రతి సంవత్సరం నాతో పాటు చాలా మంది విద్వాంసులను రప్పించి ఆధ్యాత్మిక ప్రసంగాలను ఏర్పాటు చేసేవారు. లక్ష్మీనారాయణ గారు నిర్వహించిన ఆ కార్యక్రమంలో చిన్నాపెద్దా సహా ఊరి వాళ్లందరు పెద్ద ఎత్తున పాల్గొనేవారు. అదే సందర్భంలో విద్యార్థులకు గీతాశ్లోకాల పోటీ నిర్వహించి నగదు బహుమతులందజేసేవారు. ప్రతి డిసెంబరు మాసంలో వృ ద్ధులకు దుప్పట్లిస్తారు. ప్రతివారం ఒకరోజు భువనగిరి హాస్పిటల్‌లో వృద్ధులకు ఉచితంగా మందులిస్తుండేవారు.
వెలకట్టలేని సేవా దృక్పథం..
డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి సేవా కార్యక్రమాలంటే ఎంతో ఇష్టం. తాను సంపా దించిన ధనంలో కొంత సేవా కార్యక్రమాలకు వినియోగించడం ఆయన దృక్పథాన్ని తెలియజేస్తుంది. సమయాన్ని సద్వినియో గం చేసుకున్నవాడే గొప్పవాడు. లక్ష్మీనారాయణ వీలు దొరికినప్పుడు పాటలు రాస్తా డు. ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తాడు. ఆయన డాక్టరైనప్పటికీ, ఆధ్యాత్మికంగా తన జీవితాన్ని ఇతరులకు ఆదర్శంగా గడుపుతుండేవారు.
వీరికి అన్ని విధాలుగా తోడ్ప డుతున్న హేమలతగారు ‘సహధర్మచారిణి’ అనే మాటకు ప్రతీకగా నిలవడం గొప్ప విష యం. లక్ష్మీనారాయణ గారి రచనలు కొన్ని అచ్చునాయి. వాటిలో మాతృమూర్తి గేయ మాలిక, ఆత్మబోధన కీర్తనలు, సంక్షిప్త భగవద్గీత, అమెరికా మెరుపులు, అపురూప అమె రికా అనేవి చాలా ముఖ్యమైనవి.
అమెరికా ను సందర్శించినప్పుడు వారు తమకు కలిగిన అనుభవాలను పొల్లుబోకుండా వెల్ల డించిన గ్రంథాలైన ‘అమెరికా మెరుపులు’, ‘అపురూప అమెరికా’ అవేవి చాలా బాగుండేవి. మరో విశేషమేమిటంటే వారి ఈ రెం డు పుస్తకాలు భారతీయ సంస్కృతికి, అమెరికా నాగరికతకు మధ్య గల వ్యత్యాసాలను చక్కగా చూపుతాయి. అమెరికాలో తనకు నచ్చింది ‘అమరిక’ అంటూనే, మన పిల్లల్ని ‘డాలర్ల మైకంలో జాలర్లు కాకూడదు’ అని హెచ్చరించిన గొప్ప మేధావి డాక్టర్ లక్ష్మీనారాయణగారు.
‘ఏ దేశమేగినా, ఎంతదూరమేగినా
ఆకాశవీథిలో ఆ యిద్దరే మనకు
ఆ సూర్యచంద్రులే కనిపించు దైవాలు’
డాక్టర్ లక్ష్మీనారాయణ గారు అమెరికాకు ఎప్పుడు వెళ్లినా.. మావాడు అక్కడ మూడు మాసాలకు మించి ఉండేవారు కాదు. వారి స్వదేశాభిమానం, ప్రధానంగా వృత్తి పట్ల వారికి గల నిబద్ధత, సేవాతత్పరత అనేవి లక్ష్మీనారాయణ గారిలో మనం మెచ్చుకోదగిన అంశాలుగా చెప్పవచ్చు.
వ్యాసకర్త సెల్: 9885654381