24-01-2026 12:00:00 AM
మేకల ఎల్లయ్య :
నేడు తుర్రేబాజ్ ఖాన్ వర్ధంతి :
భారతదేశ చరిత్రలో 1857 ఒక అసాధారణ సంవత్సరం. ఉత్తర భారతంలో మీరట్, ఢిల్లీ, ఝాన్సీ వంటి ప్రాంతాలు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా అట్టుడుకుతున్న తరుణంలో, దక్షిణ భారతాన ఉన్న హైదరాబాద్ సంస్థానం ఈ మహోద్యమంలో కీల క పాత్రను పోషించింది. ఈ తిరుగుబాటు కేవలం సిపాయిలకే పరిమితం కాకుండా, సామాన్య ప్రజల స్వేచ్ఛా కాంక్షకు నిదర్శనంగా నిలిచింది. హైదరాబాద్ గడ్డపై వల సవాద వ్యతిరేక పోరాటానికి వెన్నుముకగా నిలిచిన వ్యక్తి పఠాన్ తుర్రేబాజ్ ఖాన్.
ఆయన ధైర్యసాహసాలు, వ్యూహాత్మక దా డులు, చివరకు ఆయన చేసిన ప్రాణత్యా గం హైదరాబాద్ చరిత్రలో ఒక చెరగని ముద్ర. 19వ శతాబ్దపు మధ్య నాటికి హైదరాబాద్ సంస్థానం నిజాం పరిపాలనలో ఉన్నప్పటికీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపె నీ తన ‘సైన్య సహకార ఒప్పందం’ ద్వారా రాజ్యవ్యవహారాలపై పట్టు సాధించింది. 1800 సంవత్సరంలో కుదిరిన ఈ ఒప్పం దం ప్రకారం నిజాం తన రాజ్యంలో ఒక భారీ బ్రిటిష్ సైన్యాన్ని పోషించాల్సి వచ్చిం ది.
ఇది కాలక్రమేణా నిజాంను తీవ్రమైన ఆర్థిక రుణాల్లోకి నెట్టివేసింది. అఫ్జల్-ఉద్దౌలా 5వ నిజాంగా బాధ్యతలు చేపట్టే నా టికి, రాజ్యంలో బ్రిటిష్ రెసిడెన్సీ అధికారం అపరిమితంగా పెరిగిపోయింది. హైదరాబాద్‌లోని నిజాం సైన్యంలో స్థానికులతో పాటు రోహిల్లాలు, అరబ్బులు, సిక్కులు వంటి విదేశీ మూలాలు యోధులు ఉండేవారు. వీరు అత్యంత పరాక్రమవంతులు. తుర్రేబాజ్ ఖాన్ హైదరాబాద్‌లోని బేగం బజార్ ప్రాంతానికి చెందిన ఒక సాధారణ రోహిల్లా పఠాన్ కుటుంబంలో జన్మించారు.
ఆయన తండ్రి పేరు రుస్తుం ఖాన్. తుర్రేబాజ్ ఖాన్ అనే పేరు ఆ కాలంలో ధైర్యానికి, తిరుగుబాటు తత్వానికి నిదర్శనంగా ఉండేది. చారిత్రక రికార్డుల ప్రకా రం, తుర్రేబాజ్ ఖాన్ ఒకప్పుడు బ్రిటిష్ సైన్యంలో జమేదార్‌గా పనిచేశారు. అయి తే వలస పాలకుల అణచివేత ధోరణిని చూసి ఆయన తన ఉద్యోగాన్ని వీడి ప్రజా పోరాటాల వైపు మళ్లారు.
మౌల్వీ అల్లావుద్దీన్‌తో కలిసి..
ఇక హైదరాబాద్‌లో 1857 విప్లవం అ కస్మాత్తుగా జరిగినది కాదు. జూలై నాటికి పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా మారాయి. ఈ ఉద్రిక్తతలకు తక్షణ కారణం జమేదార్ చీడాఖాన్ అనే వీర సైనికుడి అరెస్టు. హైదరాబాద్ కంటింజెంట్ 3వ కావల్రీకి చెం దిన చీడాఖాన్, ఉత్తర భారతంలో తిరుగుబాటుదారులను అణచివేయడానికి ఢిల్లీకి వెళ్లాలన్న బ్రిటిష్ అధికారుల ఆదేశాలను ధిక్కరించారు. తన సొంత దేశస్థులపై కా ల్పులు జరపడం పాపమని ఆయన భా వించారు. చీడాఖాన్ తన 15 మంది సహచరులతో కలిసి బల్దానా నుంచి హైద రాబాద్ చేరుకున్నారు.
నిజాం తనకు ఆశ్ర యం ఇస్తాడని నమ్మారు. కానీ ప్రధానమంత్రి సాలార్ జంగ్ బ్రిటీష్ వారికి విధేయుడిగా ఉంటూ, చీడాఖాన్‌ను అరె స్టు చేసి కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సీ జైలులో ఉంచారు. తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ ఈ అన్యాయాన్ని ఎదిరించాలని నిర్ణయించుకున్నారు. చీడా ఖాన్‌ను విడిపించడం ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు. హైదరాబాద్ తిరుగుబాటులో మౌల్వీ అల్లావుద్దీన్ పాత్ర చాలా కీలకమైనది. తు ర్రేబాజ్ ఖాన్ సైనిక పరాక్రమం, మౌల్వీ అల్లావుద్దీన్ భావజాలం కలిసి ఒక బలమైన విప్లవ కూటమిగా ఏర్పడ్డాయి.
జూలై 17, 1857న శుక్రవారం ప్రార్థనల తర్వాత మక్కా మసీదులో ఒక పెద్ద సమావేశం జరిగింది. అక్కడ ఒక పచ్చని జెండా ఎగురవేసి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పో రాడాలని తీర్మానించారు. తుర్రేబాజ్ ఖాన్ నాయకత్వంలో సుమారు 5 వేల మంది సైన్యం మక్కా మసీదు నుంచి కోఠిలోని రెసిడెన్సీ వైపు శాంతియుత ప్రదర్శ నగా బయలుదేరారు.
బ్రిటీష్ రెసిడెన్సీపై దాడి!
తుర్రేబాజీఖాన్, ఆయన సైన్యం బ్రిటిష్ రెసిడెన్సీ వద్దకు చేరుకున్నారు. అయితే అ ది పెద్ద కోట కావడంతో తుర్రేబాజ్ ఖాన్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. రెసిడెన్సీకి ఎదురుగా ఉన్న అబ్బన్ సాహెబ్, జై గోపాల్ దాస్ అనే వడ్డీ వ్యాపారుల ఇండ్లను తమ స్థావరాలుగా మార్చుకున్నారు. ఈ భవనాలపై నుంచి రెసిడెన్సీ లోపల ఉన్న బ్రిటీష్ సైనికులపై దాడి చే యడం సులభమని భావించారు.
అయితే బ్రిటీష్ రెసిడెంట్ కల్నల్ కుత్బర్ట్ డేవిడ్సన్ ఈ దాడి గురించి ముందుగానే సమాచారం అందింది. దీంతో ఆయన తన సైని కులతో ఫిరంగులను ఎక్కుపెట్టించారు. తుర్రేబాజ్ ఖాన్ నాయకత్వంలోని తిరుగుబాటుదారులు రెసిడెన్సీ గోడలను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. తుర్రేబాజ్ ఖాన్ స్వయంగా కత్తి పట్టి యుద్ధరంగంలోకి దూకారు. కానీ బ్రిటీష్ వారి భారీ ఫిరంగుల ముందు తిరుగుబాటుదారుల ఆయుధాలు నిలవలేకపోయాయి.
దాడి విఫలం కావడంతో తుర్రేబాజ్ ఖాన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జూలై 22, 1857న తుర్రేబాజ్ ఖాన్ పట్టుబడ్డారు. అయితే విచారణ సమయంలో తుర్రేబాజ్ ఖాన్ తన సహచరుల పేర్లను చెప్పడానికి నిరాకరించారు. చివరకు కోర్టు ఆయనకు ‘దేశద్రోహం’ నేరం కింద అండమాన్‌లో జీవితకాల శిక్షను అనుభవించాలని తీర్పునిచ్చింది.
వీరమరణం..
తుర్రేబాజ్ ఖాన్ శిక్షను అనుభవించేందుకు అండమాన్‌కు పంపించే లోపే 1859 జనవరి 18న ఆయన జైలు నుంచి తప్పించుకున్నారు. అయితే తుర్రేబాజ్ ఖా న్‌పై కనిపిస్తే కాల్చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో తూప్రా న్ తాలుక్దార్ మీర్జా కుర్బాన్ తుర్రేబాజ్ దాక్కున్న ప్రదేశాన్ని నిజాం సైన్యానికి చేరవేశాడు. 1859 జనవరి 24న సైన్యం తూప్రాన్ సమీపంలోని మోగిలిగడ్డ వద్ద తుర్రేబాజ్ ఖాన్‌ను చుట్టుముట్టింది. లొం గిపోవడానికి నిరాకరించిన ఆయన తన వద్ద ఉన్న కొద్దిపాటి ఆయుధాలతోనే వీరోచితంగా పోరాడారు.
ఈ ఎదురుకాల్పుల్లో ఆయన వీరమరణం పొందారు. తుర్రేబాజ్ మరణించిన తర్వాత కూడా బ్రిటీష్ వారిలో పగ చల్లారలేదు. ఆయన భౌతికకాయాన్ని తూప్రాన్ నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ప్రస్తుత సుల్తాన్ బజా ర్ పోలీస్ స్టేషన్ ఉన్న ప్రాంతంలోని బ్రిటి ష్ రెసిడెన్సీకి సమీపంలో ఆయన మృతదేహాన్ని గొలుసులతో కట్టి బహిరంగంగా ఉరితీశారు.
ఈ చర్య ద్వారా తిరుగుబాటుదారులను హెచ్చరించాలనుకున్నప్పటికీ ప్రజల దృష్టిలో తుర్రేబాజ్ ఖాన్ ఒక మహోన్నత అమరవీరుడిగా స్థిరపడ్డారు. చరిత్ర పుస్తకాల్లో తుర్రేబాజ్ ఖాన్ గురించి సమాచారం తక్కువగా ఉన్నప్పటికీ, ఆయ న్ను ‘హైదరాబాద్ షంషేర్’, ‘రాబిన్ హుడ్’ గా చరిత్రకారులు అభివర్ణించారు. ఆయన గురించి ఎటువంటి చిత్రపటాలు లభ్యం కాలేదు. కానీ ప్రజల జానపద కథల్లో ఆయన రూపురేఖలు వర్ణించబడ్డాయి.
గౌరవం అవసరం!
తుర్రేబాజీఖాన్ త్యాగాన్ని స్మరించుకుం టూ హైదరాబాద్‌లో కొన్ని స్మారక చిహ్నా లు ఉన్నాయి. కోఠి బస్ స్టాండ్ వద్ద ఒక తెలుపు రంగు గ్రానైట్ స్తూపం ఉంటుంది. అదే కోఠి అమరవీరుల స్తూపం. దీని చు ట్టూ నాలుగు ఏనుగు విగ్రహాలు ఉంటా యి. కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలే జీ ముందు ఉన్న రహదారికి తుర్రేబాజ్ ఖాన్ పేరు పెట్టారు. రెసిడెన్సీ వెనుక ఉన్న రహదారికి తుర్రేబాజ్ ఖాన్ సహచరుడు మౌల్వీ అల్లావుద్దీన్ పేరు పెట్టారు.
అయితే ఈ స్మారక చిహ్నాలు సరైన నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. జనవరి 24న తుర్రేబాజ్ ఖాన్ వర్ధంతి సందర్భంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు నివాళులు అర్పిస్తున్నప్పటికీ, ప్రభుత్వ స్థాయిలో మరిన్ని కార్యక్రమాలు జరగాల్సిన అవసరముంది. తుర్రేబాజ్ ఖాన్ చరిత్ర కేవలం ఒక వ్యక్తి చరిత్ర కాదు. అది ఒక జాతి ఆత్మగౌరవ పోరాటం.
శక్తివంతమైన వలస పాలకులను ఎదిరించడానికి ఆయుధాలు ఉంటే సరిపోదని, అకుంఠిత దీక్ష, ప్రాణ త్యాగానికి సిద్ధపడే గుణం ఉండాలని నిరూ పించారు. 1857 హైదరాబాద్ తిరుగుబాటు విఫలమైనప్పటికీ తుర్రేబాజ్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయా రు. ఈ వీర పఠాన్ త్యాగం స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో సువర్ణాధ్యాయం. చరిత్ర పుస్తకాల్లో ఆయనకు గౌరవం, గుర్తింపు కల్పించడం మన బాధ్యత.
వ్యాసకర్త సెల్ : 9912178129