24-01-2026 12:00:00 AM
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరు పొందిన చైనా గత నాలుగేళ్లుగా జనాభాలో తగ్గుదలను చూస్తూ వస్తున్నది. తాజా నివేదికల ప్రకారం 2025లో చైనాలో కొత్తగా 7.92 మిలియన్ జననాలు నమోదైతే.. మరణాల సంఖ్య మాత్రం 11.31 మిలియన్లుగా నమోదయ్యాయి. గతేడాది చైనాలో ఇదే జననాల సంఖ్య 8.54 మిలియన్లుగా ఉంటే.. 10.93 మిలియన్ల మరణాలు చోటు చేసుకున్నాయి. గడిచిన 50 ఏళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. అయితే జనాభా స్థిరీకరణ, పౌరులకు మెరుగైన జీవన వ్యయం అందించడంలో చైనా, భారత్‌ల మధ్య చాలా వ్యత్యాసముంది.
వచ్చే శతాబ్దం నాటికి భారత జనాభా 1.5 బిలియన్లకు చేరుకోనుండగా, అదే సమయంలో చైనా జనాభా 800 మిలియన్ల కంటే తక్కువగా నమోదువుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిజానికి జనాభా అధికంగా ఉండడం సంక్షోభం కిందకు రాదని, భారత జనాభాలో యువత అధికంగా ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి ఇది వరకే ప్రకటించింది. రాబోయే పదేళ్లలో యువతరం శక్తితో ఆర్థికం పరంగా భారత్ రెండింతలు అభివృద్ధి చెందే అవకాశముంది.
రెండు దేశాలు సంతానోత్పత్తి రేటులో తగ్గుదల సాధించినప్పటికీ చైనాలో మరణాల రేటు పెరగడం, జననాల రేటు తగ్గడం ఆర్థిక సంక్షోభానికి దారి తీసే అవకాశముంది. 1980ల ముందు వరకు చైనాలో జనాభా పెరుగుదల అధికంగా ఉండేది. అయితే జనాభా నియంత్రణ కోసం ఒకరి కంటే ఎక్కువ కనేందుకు వీల్లేదనే నిబంధన తీసుకొచ్చింది. ఇదే ఆ దేశాన్ని కష్టాల్లోకి నెట్టేసింది. దీంతో పదేళ్ల క్రితం ఆ నిబంధనను ఎత్తేయడంతో పాటు పిల్లల్ని కనాలంటూ తీసుకొచ్చిన పాలసీలు కూడా ఉపయోగపడకుండా పోయాయి.
చైనాలో మహిళల సగటు సంతాన సాఫల్య రేటు తగ్గిపోవడమే ఇందుకు కారణం. సాధారణంగా సంతాన సాఫల్య రేటు 2.1 ఉండాలి. కానీ చైనాలో ఇది 1.3కి పడిపోయింది. ఆర్థికంగా బలమైన దేశమైనప్పటికీ చైనాలో పిల్లల పెంపకం భారంగా మారిపోయింది. 18 ఏళ్ల వరకు చదువు, ఇతర సౌకర్యాల కల్పనకు దాదాపు 76 వేల డాలర్లు ఖర్చు అవుతున్నట్లు అంచనా. జీవనవ్యయం పెరిగిపోవడంతో పిల్నల్లి పెంచడం కష్టంగా మారింది. దీంతో చైనాలో ఉన్న యువత పెళ్లిళ్లకు దూరంగా ఉండిపోతున్నారు.
దీనికి తోడు వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండడంతో పనిచేసే వారి సంఖ్యలోనూ తగ్గుదల కనిపిస్తుంది. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన చైనాలో శ్రామిక శక్తి తగ్గడం వల్ల ఇది ఆ దేశ ఆర్థిక శక్తిపై ప్రభావం చూపనుంది. చైనా వృద్ధిని దీర్ఘకాలంగా దృష్టిలో ఉంచుకొని చూస్తే నిజమైన అభివృద్ధికి విద్య, ఆరోగ్యం ప్రధాన పెట్టుబడులుగా నిలిచాయని చెప్పొచ్చు. కానీ జనాభా పెరుగదలతో ఆ దేశం పెట్టుకున్న కఠిన నిబంధనలు ఇవాళ చైనాకు ముప్పుగా మారాయి. కానీ భారత్‌లో పరిస్థితి వేరుగా ఉంది.
కొన్నేళ్లుగా భారతదేశ ఆరోగ్య రంగం నిలకడైన అభివృద్ధిని చూపిస్తున్నది. సంతానోత్పత్తి రేటులో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ, శిశు మరణాల రేటు తక్కువగా ఉండడంతో పెద్దగా తేడా కనిపించడం లేదు. భారత జనాభాలో యువత అధికం కావడంతో దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు అవకాశముంది. కానీ అదే సమయంలో దేశ జనాభాకు సరిపడా వనరులు ఉన్నాయా లేదా అనేది పరిశీలించిన తర్వాతే అడుగులు వేయడం ఉత్తమం.