calender_icon.png 18 December, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తక్కువ ఖర్చుతో లాభదాయక వరి సాగు

18-12-2025 12:44:59 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

బూర్గంపాడు, డిసెంబర్ 17, (విజయక్రాంతి):  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి డ్రోన్ ద్వారా విత్తనాలు మందులు పిచికారి చేయడంతో లాభదాయకమైన వరి సాగు చేయవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.

బుధవారం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బూర్గంపాడు మండలం సోంపల్లి గ్రామంలో డ్రోన్ సాంకేతికత ద్వారా నేరుగా వరి విత్తనాలు వెదజల్లే  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డ్రోన్ ద్వారా వరి విత్తనాల వెదజల్లే ప్రక్రియను ప్రారంభించారు.

ఈ సందర్భంగా  కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటే తక్కువ ఖర్చుతో లాభదాయకంగా వరి సాగు చేయవచ్చని తెలిపారు. డ్రోన్ ద్వారా వరి విత్తనాలను నేరుగా వెదజల్లడం, అలాగే గడ్డి మందులు , పురుగుమందులను పిచికారీ చేయడం ద్వారా కూలీ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు.

అదేవిధంగా సమయం ఆదా కావడంతో పాటు పంట స్థాపన సమానంగా జరిగి మంచి దిగుబడులు సాధించవచ్చని ఆయన అన్నారు. రైతులు ఈ విధమైన ఆధునిక పద్ధతులను స్వీకరించి వ్యవసాయంలో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి. భరత్  మాట్లాడుతూ, డ్రోన్ ద్వారా వరి విత్తనాలు వెదజల్లే విధానంలో సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే తక్కువ విత్తనాలు సరిపోతాయని, దీంతో విత్తన వ్యయం తగ్గుతుందని వివరించారు.

ఈ విధానం ద్వారా సాగు ఖర్చులు కూడా గణనీయంగా తగ్గడంతో పాటు రైతులకు అధిక లాభాలు సాధ్యమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు డ్రోన్ ద్వారా వరి విత్తనాలు వెదజల్లే ప్రత్యక్ష ప్రదర్శనను వీక్షించి, ఈ ఆధునిక సాంకేతికత ప్రయోజనాలపై అవగాహన పొందారు.

కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ డ్రోన్ వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమం రైతుల్లో ఆధునిక సాంకేతికతపై నమ్మకాన్ని పెంచి, తక్కువ ఖర్చుతో లాభదాయకమైన వరి సాగుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్. శరత్ చంద్ర, ఉద్యాన శాస్త్రవేత్త  బి. శివ, ఏడిఏ  తాతారావు, శంకర్, సోంపల్లి గ్రామానికి చెందిన అధికారులు, సిబ్బంది మరియు సుమారు 80 మంది అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.