16-09-2025 12:16:23 AM
జిల్లా వ్యాప్తంగా వికలాంగుల ధర్నా
సిద్దిపేట రూరల్, సెప్టెంబర్ 15: కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేందుకు అనేక హామీలు ఇచ్చి మోసం చేస్తుందని ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉమ్మడి మెదక్ జిల్లా కోఆర్డినేటర్ దండు శంకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా తహసిల్దార్ కార్యాలయాల ముందు నిరసన వ్యక్తం చేసి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దండు శంకర్ మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ రూ.6016, ఇతర పెన్షన్లు రూ.4016కి పెంచుతామని ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే వికలాంగులతో చర్చలు జరిపి వారి డిమాండ్లను అమలు చేయాలని కోరారు. పెన్షన్ పెంచేంతవరకు నిరసనలు కొనసాగుతాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా జరిగిన నిరసన కార్యక్రమాలలో ఆయా మండల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వికలాంగులు పాల్గొన్నారు.