calender_icon.png 9 May, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలు నెరవేర్చాల్సిందే

08-05-2025 01:41:28 AM

  1. ప్రభుత్వ విజ్ఞప్తిని మన్నించి సమ్మెకు పోని ఆర్టీసీ జేఏసీ

ట్రేడ్ యూనియన్ గుర్తింపు, సొంత ఎలక్ట్రిక్ బస్సులు, ఆర్టీసీ విలీనం ప్రధాన డిమాండ్లు

సమ్మె తప్పడంతో ఊపిరిపీల్చుకున్న ప్రభుత్వం

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత గత 4 నెలలుగా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల సాధన కోసం ఊహించని విధంగా జేఏసీగా ఏర్పడి పోరాటానికి సిద్ధమయ్యాయి. రెండుసార్లు సమ్మె నోటీసు ఇచ్చినా అటు ఆర్టీసీ యాజమాన్యం గానీ ఇటు ప్రభుత్వం గానీ పెద్దగా స్పందించలేదు. అయితే మూడోసారి గత నెల 7వ తేదీన ఇచ్చిన సమ్మె నోటీసుపై ప్రభుత్వంలో చలనం వచ్చింది.

మే 7వ తేదీన తప్పకుండా సమ్మె చేస్తామంటూ జేఏసీ ఆధ్వర్యంలోని కార్మిక సంఘాలు, కార్మికులు సిద్ధమైపోయారు. డిపో డిపోనకు తిరిగి సమ్మెపై విస్తృత ప్రచారం చేశారు. సమ్మె చేయకుంటే తమకు మనుగడ ఉండదని కార్మికులు గుర్తించారు. సమ్మెపై సర్కారు ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంది. ఇక సమ్మె తప్పదని ప్రభుత్వం సైతం గుర్తించింది.

ఆర్టీసీ కార్మికులు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి, రవాణాశాఖ మంత్రి ఇండ్ల తలుపులు తెరుచుకునే ఉన్నాయని పిలుపునిచ్చినా జేఏసీ చర్చలకు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం కంగుతింది. అసలే రాష్ట్రంలో పరిస్థితులు తమకు అంత సానుకూలంగా లేని నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఎలాగైనా సమ్మె ఆపేలా చూడాలని సీఎం స్థాయిలో సంబంధిత మంత్రికి ఆదేశాలు వచ్చాయని సమాచారం.

ఈ నేపథ్యంలోనే సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సహకారం తీసుకొని ఆర్టీసీ జేఏసీని ఒప్పించి చర్చలకు పిలిచారు. అయితే ఈ చర్చల్లో సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలకు మాత్రమే చోటు ఉండాలని, సమ్మెను పక్కదారి పట్టించాలని చూసిన సంఘాలకు, నేతలకు చోటిస్తే తాము చర్చలకే రాబోమని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వారిని ఒప్పించి మంత్రి పొన్నం ప్రభాకర్ వద్దకు తీసుకుపోయారు కూనంనేని. దాదాపు 3.14 గంటల సేపు చర్చలు జరిగితే మంత్రి నుంచి తమకు సానుకూల స్పందనే వచ్చినట్టుగా ఆర్టీసీ జేఏసీ చెబుతోంది. 

ట్రేడ్ యూనియన్ గుర్తింపు ఇచ్చేందుకు పైసా ఖర్చు అవ్వదు..

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులపై దొంగదెబ్బ వేసినట్టుగా ఆర్టీసీ జేఏసీ చెబుతోంది. ఆర్టీసీ ఏర్పడినప్పటి నుంచి ట్రేడ్ యూనియన్లను రద్దు చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో యాజమాన్యం ఒంటెద్దుపోకడలు ప్రారంభమయ్యాయి. కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకున్నా అడిగే దిక్కు లేకుండా పోయింది. అత్యవసర వేళల్లో కూడా కనీసం సెలవులు ఇవ్వకుండా కార్మికులను వేధిస్తున్నా అడిగే నాథుడే లేకుండాపోయారు.

ఇది కార్మికులందరికీ తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అచ్చం కేసీఆర్ సర్కారు తీరుగానే వ్యవహరించడంతో కార్మికుల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోయాయి. అందుకే సమ్మె కోసం సిద్ధమయ్యారు. ట్రేడ్ యూనియన్ గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక ఉత్తర్వు ఇస్తే చాలని, ఇందుకు పైసా ఖర్చు కూడా కాదని ఆర్టీసీ జేఏసీ చెబుతోంది.

కానీ యాజమాన్యానికి ఇది ముమ్మాటికీ నచ్చటం లేదని చెబుతోంది. ట్రేడ్ యూనియన్ గుర్తింపు వస్తే కార్మికులు ప్రశ్నించే అవకాశం వస్తుందని.. ప్రశ్నిస్తే తమ తప్పులు బయట పడతాయని వారికి భయం పట్టుకుందని అంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా ఉన్నా, ఆర్టీసీని నడుపుతున్న కొందరు ఉద్దేశపూర్వకంగానే ట్రేడ్ యూనియన్ గుర్తింపు విషయంలో తప్పుదారి పట్టిస్తున్నారని జేఏసీ అంటోంది. 

ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు తీసేయాలి

ఆర్టీసీలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా ఆర్టీసీ మనుగడకే ముప్పని జేఏసీ అంటోంది. ఒక్క ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సు వల్ల 5గురి ఉద్యోగాలు పోతాయని చెబుతోంది. ప్రతీ ఎలక్ట్రిక్ బస్సుపై కేంద్రం ఇస్తున్న 50 శాతం సబ్సిడీని ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా నేరుగా ఆర్టీసీకే దక్కేలా చేస్తే రెండు బస్సులు కొంటే ఒక బస్సు ఫ్రీగా వస్తుందని జేఏసీ నాయకులు చెబుతున్నారు.

ఆర్టీసీ సొంతంగా కొనడం వల్ల తక్కువ ఖర్చుతో డీజిల్ భారం కూడా లేకుండా బస్సులు నిర్వహించే అవకాశం ఉంటుందని, ఫలితంగా లాభాలు కూడా పెరుగుతాయని కార్మికులు చెబుతున్నారు. అంతేకాకుండా డిపోలకు డిపోలే ప్రైవేట్‌పరం చేయాల్సిన దుస్థితి కూడా ఉండదని అంటున్నారు. 

విలీనం హామీ నిలబెట్టుకోవాలి..

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు ప్రతినెలా మహాలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయి రూ.350 కోట్లను క్రమం తప్పకుండా ఇవ్వడంతో పాటు మిగతా వర్గాల ప్రజల బకాయిలను కూడా ఎప్పటికప్పుడు చెల్లిస్తే ఆర్టీసీ మనుగడ సాధ్యమని అంటున్నారు. 2021 పీఆర్‌సీ, ఉద్యోగ భద్రత, రిటైర్డ్ ఉద్యోగుల బెన్‌ఫిట్స్ వెంటనే చెల్లింపు, సింగరేణి తరహాలో కారుణ్య నియామకాలు చేపట్టడం వంటి సమస్యలన్నీ పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ కోరుతోంది.