08-05-2025 01:30:58 AM
హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): దేశంలో ఏడాది వ్యవధిలోనే 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వానికే దక్కిందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగాస్తామని స్పష్టంచేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌లో ‘నాట్కో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల’ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా పనిచేస్తోందని చెప్పారు. ఈ ప్రక్రియలో నిపుణులను భాగస్వామ్యం చేస్తున్నా మని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో చదివే విద్యార్థులను తీర్చిదిద్దుతామని స్పష్టంచేశారు.
ఏఐ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీస్‌ను కరిక్యులంలో భాగం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సూచించారు. ప్రభుత్వ ఉపాధ్యా యులకు ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను కల్పించామని గుర్తుచేశారు. పాఠశాలల నిర్వహణ కోసం ప్రత్యేకంగా అమ్మ కమిటీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ప్రతి హామీని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు కావాలనే పనిగట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తమది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని, దశలవారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే కే శంకరయ్య, నాట్కో సంస్థ ప్రతినిధులు లక్ష్మీనారాయణ, పీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.