10-07-2025 12:02:55 AM
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లు త్వరలోనే ప్రమోషన్లు పొందనున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. అధ్యాపకులకు ప్రమోషన్లు లేకపోవడంతో సీనియర్ లెక్చరర్లనే కళాశాలలకు ఇన్‌చార్జి ప్రిన్సిపళ్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రమోషన్ల ద్వారా 80కిపైగా ప్రిన్సిపాళ్ల పోస్టులను మాత్రమే భర్తీ చేయనున్నారు.
1:3 నిష్పత్తిలో అధ్యాపకులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన జాబితాను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 ప్రకారం ప్రిన్సిపళ్లను రాష్ట్ర కేడర్‌గా, లెక్చరర్లను మల్టీజోన్ పోస్టులుగా నిర్ణయిస్తూ సర్వీస్ నిబంధనల్లో ప్రభుత్వం సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
టీచర్లకు కూడా..
ఇదిలా ఉంటే టీచర్లకూ పదోన్నతులు ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఇప్పటికే హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు సంబంధించిన కసరత్తును అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వం అనుమతినిస్తే పదోన్నతుల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.