calender_icon.png 14 September, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

50 దాటితే ప్రోస్టేట్ సమస్యలు

14-09-2025 12:59:18 AM

50 ఏళ్లు దాటిన పురుషులకు కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ లక్ష్యాలు, రిటైర్మెంట్ ప్రణాళికలు చాలా ముఖ్యం. కానీ ఈ వయసులో చాలా మంది నిర్లక్ష్యం చేసే తీవ్ర సమస్య ప్రోస్టేట్ ఆరోగ్యం. ఆకారం చిన్నదే అయినా, ఇది పురుషుల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తలు అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

దురదృష్టవశాత్తు ప్రోస్టేట్ సమస్యల గురించి మాట్లాడటానికి చాలామంది వెనుకంజ వేస్తారు. వయసు పెరిగింది కాబట్టి సహజమని భావించి దీని తాలూకు లక్షణాలను పట్టించుకోరు. కానీ నిర్లక్ష్యం చేయడం వల్ల చికిత్స చేయదగ్గ సమస్యలు మరింత తీవ్రంగా మారతాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రోస్టేట్ గ్రంథి మూత్రాశయం కింద ఉండి, మూత్రనాళాన్ని చుట్టి ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ ఇది పెద్దదవుతుంది. కొన్నిసార్లు హానికరం కాకపోయినా, తరచూ మూత్ర సమస్యలకు దారితీస్తుంది.

సాధారణంగా కనిపించే సమస్యలు..

ఎన్లారజ్డ్ ప్రోస్టేట్ (బీపీహెచ్): కాన్సర్ కాని వ్యాధి, కానీ మూత్ర విసర్జనలో ఇబ్బందులు కలిగిస్తుంది.

ప్రోస్టాటైటిస్: ఇన్ఫెక్షన్ లేదా వాపు వల్ల నొప్పి, జ్వరం, అసౌకర్యం.

ప్రోస్టేట్ క్యాన్సర్: పురుషుల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్లలో ఒకటి. ప్రారంభ దశలో లక్షణాలు లేకపోవచ్చు. 

నిర్లక్ష్యం చేయరాని లక్షణాలు..

తరచూ, ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రం పోవాలనిపించడం

మూత్రం మొదలుపెట్టడంలో లేదా ఆపడంలో ఇబ్బంది

బలహీనమైన లేదా మధ్యలో ఆగిపోయే ప్రవాహం

మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాలేదని అనిపించడం

మూత్రం చేసేటప్పుడు మంట

మూత్రం లేదా వీర్యంలో రక్తం

వెన్ను, నడుము లేదా పెల్విస్‌లో నిరంతర నొప్పి

ఈ లక్షణాలు తప్పనిసరిగా క్యాన్సర్ అని కాదు, కానీ ప్రోస్టేట్ సమస్యలకు సంకేతం. వెంటనే యూరాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.

ప్రోస్టేట్ క్యాన్సర్ నిశ్శబ్ద ముప్పు..

ప్రోస్టేట్ క్యాన్సర్ మొదటి దశల్లో ఎక్కువగా లక్షణాలు కనిపించవు. అందుకే 50 ఏళ్లు దాటిన పురుషులు ప్రోస్టేట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి.

పీఎస్‌ఏ రక్త పరీక్ష, అబ్డామినల్ స్క్రీనింగ్, వైద్యుడి పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.

కుటుంబంలో ప్రోస్టేట్ క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు 45 ఏళ్ల నుంచే స్క్రీనింగ్ ప్రారంభించాలి.

ముందుగా గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది, ఆరోగ్యంగా జీవించవచ్చు.

ఆరోగ్యంగా ఉండేందుకు పాటించాల్సిన అలవాట్లు

నియమిత పరీక్షలు చేయించుకోండి. ప్రతి సంవత్సరం ఆరోగ్య తనిఖీల్లో ప్రోస్టేట్ స్క్రీనింగ్ తప్పనిసరి.

ఆహారం జాగ్రత్తగా తీసుకోండి. కూరగాయలు, పండ్లు, ధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. ఎర్ర మాంసం, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించండి.

వ్యాయామం చేయండి.  క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది.

ధూమపానం, మదాన్ని నివారించండి.  ఇవి ప్రోస్టేట్, మూత్ర సంబంధిత సమస్యలను పెంచుతాయి.

శరీర సంకేతాలను గమనించండి. చిన్నచిన్న మార్పులనైనా నిర్లక్ష్యం చేయొద్దు.

నిపుణుల సలహా:

ప్రోస్టేట్ ఆరోగ్యం గురించి మాట్లాడటానికి ఇబ్బంది పడకండి. ఇది బలహీనత కాదు బాధ్యత. 50 ఏళ్లు దాటిన ప్రతీ పురుషుడు తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి.

మీరు మీకు ఒక ప్రశ్న వేసుకోండి: చివరిసారి ఎప్పుడు ప్రోస్టేట్ పరీక్ష చేయించుకున్నాను? సమాధానం ఎప్పుడూ కాదు లేదా చాలా ఏళ్ల కిందటే అయితే, ఇప్పుడే చర్య తీసుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. ఈ రోజు నుంచే జాగ్రత్తలు ప్రారంభించండి.