calender_icon.png 16 October, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్షణ కవచం ఫైటోన్యూట్రియెంట్స్

16-10-2025 12:22:07 AM

ఇవాళ్టి రోజుల్లో మనం కేవలం రుచికోసమే ఆహారాన్ని తిం టున్నాం.. కానీ తినే తిండి సరైనదా? కాదా? అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరముంది. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రకారం ప్రపంచంలో 2030 నాటికి ఆకలిని పూర్తిగా నిర్మూలించి, పోషకాహార లోపం లేకుండా చేయాలి. నేడు ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఈట్ రేయిన్ బో ప్లేట్’ అనే కొత్త ఆహార సూత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఎలాంటి కృత్రిమ రంగులకు ఆస్కారం లేదు. విభిన్న రంగుల ఆహార పదార్థాల ద్వారా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా పొందే పద్ధతిని ‘ఈట్ రెయిన్‌బో ప్లేట్’ అని పిలుస్తున్నాం. దీనినే సైన్స్ భాషలో ‘ఫైటోన్యూట్రియెంట్స్ ఫుడ్’ అని పిలుస్తారు. ప్రతి రంగు మన ఆరోగ్యానికి ప్రత్యేకమైన ప్రయోజనాలను అందిస్తుంది, అలాగే పర్యావరణహితమైన ఆహారాన్ని ప్రోత్సహి స్తుంది.

మన పళ్లెం దాదాపు సగ భాగం పండ్లు, కూరగాయలతో పాటు పావు భాగం ప్రోటీన్ ఆహారాలతో, మరొక పావు భాగం పూర్తిగా ధాన్యాలతో నింపాలి. ఈ పద్ధతిలో ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఊదా, తెలుపు రంగుల పండ్లు, కూరగాయలతో కూడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఫైటోన్యూట్రియెంట్లతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఫైటోన్యూట్రియెంట్స్ అనేవి ప్రతి పండు లేదా కూరగాయ మొక్కలో సహజంగా లభించే రసాయన సమ్మేళనం. ఇవి మొక్కలకు ప్రత్యేకమైన రంగు, వాసన, రుచులను ఇస్తాయి. కాగా ఫైటోన్యూట్రియెం ట్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ దీర్ఘకాలిక రోగాల నుంచి రక్షణనిస్తాయి. మొక్కలతో కూడిన ఫైటోన్యూట్రియెంట్స్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్, గుండె జబ్బులు వంటి అనేక వ్యా ధులను నివారించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఫైటోన్యూట్రియెంట్స్ ఎక్కువగా పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు, పప్పులు, తృణధాన్యాలు, మూలికల్లో లభిస్తాయి.

ఎప్పటికప్పుడూ సీజనల్, తాజా పండ్లు, కూరగాయల ను ఉపయోగించి సంవత్సరం పొడవునా వైవిధ్యం కలిగిన ఆహారాన్ని తీసుకో వడం వల్ల నిరంతరం ఆరోగ్యకరంగా ఉండొచ్చు. ఇక అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, మనం రోజూవారీ ఆ హార ప్రణాళికలో రోజుకు కనీసం 2 కప్పుల పండ్లు, కూరగాయలు తీసుకోవాలని సూచిస్తుంది. వర్ణరంజితమైన ఆహారాన్ని తినడం ద్వారా రెయిన్‌బోలోని రంగులను మన ఆహార పళ్లెంలోకి తెచ్చినట్లవుతుంది. రంగుల వైవిధ్యం ఎంతుంటే ఆరోగ్య ప్రయోజనాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఇవి ప్రకృతిలో నుంచి వచ్చిన శక్తివంతమైన రంగులని గ్రహించాల్సిన అవసరముంది. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు మన పెద్దలు. నిత్యం విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యవంతమైన కొవ్వులు, ప్రోబయాటిక్స్.. ఇలా సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా మన జీవితం ఆనందదాయకంగా మారుతుంది.

వ్యాసకర్త: బి.ప్రభాకర్‌రెడ్డి