08-11-2025 12:00:00 AM
మేడ్చల్, నవంబర్ 7(విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనుల్లో జాప్యం జరగడం పట్ల వివిధ పార్టీల నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్ డిపో నుంచి ప్రారంభమైన ర్యాలీ పోలీస్ స్టేషన్ వరకు జరిగింది. అక్కడ రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదాలకు కారణమవుతున్న కాంట్రాక్టర్ ను అరెస్టు చేయాలని నినాదాలు చేశారు.
రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు రోడ్డుపై బైఠాయించిన వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పనులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 40 మందికి పైనే మృత్యువాత పడ్డారు. ఫ్లై ఓవర్ పనుల్లో జాప్యం చేయడమే గాక, ఇరువైపులా రోడ్డు కూడా నిర్మించలేదు.
దీంతో రహదారి ప్రమాదకరంగా తయారైంది. గురువారం రాత్రి ఒక యువకుడు డీసీఎం కింద పడి చనిపోయాడు. దీంతో పట్టణవాసులు, స్థానిక నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మున్సిపల్ అధ్యక్షురాలు శైలజ హరినాథ్, బిజెపి నాయకుడు చెరుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, పాతూరి సుధాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కొండం ఆంజనేయులు, వంశీధర్ రెడ్డి, మైసూర్ రాజు, అనిల్, మాజీ సర్పంచ్ మురళీధర్ గుప్తా, టి ఆర్ పి నాయకుడు ఎండి నాగరాజు, రాజ్ కుమార్, జాకాట ప్రేమ దాస్ తదితరులు పాల్గొన్నారు.
పనుల్లో జాప్యంపై పిడికి ఫోన్ లో ఫిర్యాదు
ఫ్లై ఓవర్ పనుల్లో జాప్యం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై బిజెపి నాయకుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఎన్హెచ్‌ఎఐ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ కు ఫోన్ లో ఫిర్యాదు చేశారు. రహదారి ప్రమాదకరంగా తయారైందని, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని సుదర్శన్ రెడ్డి తెలిపారు. కాంట్రాక్టర్ కు నోటీసు ఇచ్చామని పిడి తెలిపారు. మొన్నటి వరకు వర్షాలు కురవడం వల్ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేయలేకపోయారని, ఈనెల 12 నుంచి రోడ్డు పనులు జరుగుతాయని తెలిపారు. కాంట్రాక్టర్కు పర్మిషన్ నోటీసు ఇచ్చామని పిడి తెలిపినట్లు సుదర్శన్ రెడ్డి తెలిపారు.