10-04-2025 07:37:15 PM
ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ..
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం కార్మికులకు నాణ్యమైన పనిముట్లను అందించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం ఏరియాలోని కేకే 5 గనిని సందర్శించి, కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కోల్ కటింగ్ డ్రిల్ రాడ్లు నాసిరకం వస్తున్నాయని, దీంతో డ్రిల్ చేసే సమయంలో ఇబ్బందిగా ఉందన్నారు. కార్మికులకు నాణ్యమైన డ్రిల్ రాడ్లు, బిట్లు అదేవిధంగా చేతి గ్లౌజులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేకే 5 కార్మికులు క్రమశిక్షణతో కష్టపడి పని చేసి 106 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించారని, అధికారులు కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, పనిముట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
హెచ్ఎంఎస్ నాయకులు కార్మిక సమస్యలు పట్టించుకోవడం లేదని ఏఐటియుసిపై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. ప్రభుత్వాలకు అమ్ముడుపోయిన వారికి కార్మిక సమస్యలు పట్టింపు లేదని ఎద్దేవా చేశారు. గుర్తింపు సంఘం గెలిచిన అనంతరం 9 నెలల తర్వాత గుర్తింపు పత్రం ఇచ్చారని, గుర్తింపు పత్రం తీసుకున్న నాలుగు నెలల్లోనే రెండు దఫాలుగా డైరెక్టర్ లతో సీఎండీతో చర్చలు జరిపి, డిస్మిస్ కార్మికులకు అవకాశం ఇచ్చిన విధంగా ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా ట్రేడ్ మెన్స్ లకు సూటబుల్ జాబ్ ఇప్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. అదే విధంగా కోలిండియా మాదిరిగా పెర్క్స్ పై ఐటి యాజమాన్య భరించేలా చేసిన ఘనత ఏఐటీయూసీకి దక్కుతుందని తెలిపారు. కార్మికులకు సొంత ఇంటి పథకం కోసం ఒప్పందం చేసుకున్న ఘనత ఏఐటీయూసీ దక్కుతుందన్నారు. పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇప్పించడం లాంటి పనులు హెచ్ఎంఎస్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
కార్మికులకు ఏఐటియుసి దగ్గర అవుతుందని జీర్ణించుకోలేక ఏఐటియుసిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. హెచ్ఎంఎస్ నాయకులు నిజంగా కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే కార్మిక సమస్యలపై ఉద్యమాలు, హక్కుల కోసం పోరాటాలు చేయాలని సూచించారు. ఏఐటియుసిని విమర్శిస్తే ఊరుకునేది లేదని, కార్మిక వర్గం తిరుగుబాటు చేసే పరిస్థితి హెచ్ఎంఎస్ తెచ్చుకోవద్దన్నారు. అనంతరం గని యాజమాన్యంతో సమావేశమై కార్మిక సమస్యలను చర్చించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్, జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, అసిస్టెంట్ కార్యదర్శి సోమిశెట్టి రాజేష్, వర్క్ ఇన్స్పెక్టర్ విక్రమ్ సింగ్, గని పిట్ కార్యదర్శి గాండ్ల సంపత్ కుమార్, పిట్ కమిటీ సభ్యులు ప్రేమ్ లాల్, మేకల సంతు, ఉదారి శ్రీకాంత్, గుమ్మడి సంపత్, హేమచందు, పంగ చంద్రశేఖర్, తేజ, నక్క స్వర్ణలత, స్రవంతిలు పాల్గొన్నారు.