calender_icon.png 13 July, 2025 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వసతుల కల్పన

11-07-2025 12:00:00 AM

 జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

పటాన్చెరు, జూలై 10: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు పక్కా ఇండ్ల నిర్మాణం కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, డబుల్ బెడ్ రూమ్ పథకాలలో పక్కా ఇల్లు నిర్మించి ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. గురువారం ప్రధానమంత్రి కార్యాలయ అధికారిని మన్మిత్ కౌర్, జిహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్వి  కర్ణన్ లతో కలిసి కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాలనీలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన రెండు పడక గదుల ఇండ్లను ప్రధానమంత్రి కార్యాలయ అధికారిని మన్మిత్ కౌర్, కలెక్టర్ ప్రావిణ్య, జిహెచ్‌ఎంసి కమిషనర్లు పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో గల వసతులను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు మెరుగైన వసతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

త్వరలో ఇండ్ల సమీపంలో బిఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఏర్పాటు, బ్యాంక్ సౌకర్యాలు, పోస్ట్ ఆఫీస్, ప్రైమరీ ఇంటర్ సెంటర్,  అంగన్వాడి కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలు, ఇతర సౌకర్యాలు, వసతులను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. దీంతోపాటు మెరుగైన రవాణా వసతుల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కాలనీ నుండి హైదరాబాదులోని అన్ని ప్రాంతాలకు బస్సు రవాణా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

మహిళా శక్తి క్యాంటీన్ల పరిశీలన..

తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో మహిళా సాధికారతలో భాగంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను అధికారులు పరిశీలించారు. స్వశక్తితో క్యాంటీన్ నడిపిస్తున్న మహిళలను అభినందించారు. మహిళా సాధికారత, మహిళల ఆర్ధిక  స్వాలంబన కోసం  రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా వివిధ వ్యాపారాలలో రాణించడానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ  చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్యాధికారిణి గాయత్రీదేవి, సంగారెడ్డి ఆర్డిఓ రవీందర్ రెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్, గృహనిర్మాణ శాఖ అధికారులు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులుపాల్గొన్నారు.