17-11-2025 11:46:18 PM
నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదు
అధికారులు చొరవ తీసుకోవాలి
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్
జీహెఎంసీ వ్యాప్తంగా ప్రజావాణికి 172 ఫిర్యాదులు
హైదరాబాద్ సిటీ బ్యూరో (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులు, విన్నపాలను ఏమాత్రం జాప్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. సోమవారం జీహెఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన కమిషనర్, వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్జీదారులు ఒకే సమస్యపై పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదు. విభాగాధిపతులు హెఓడీలు చొరవ తీసుకుని, సమస్యలను మూలాల నుంచి పరిష్కరించడానికి కృషి చేయాలి అని స్పష్టం చేశారు.
నగరవ్యాప్తంగా 172 ఆర్జీలు
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జీహెఎంసీ ప్రధాన కార్యాలయంలో మొత్తం 67 విన్నపాలు, ఫిర్యాదులు అందాయి. నగరంలోని ఆరు జోన్ల పరిధిలో మరో 105 అర్జీలు వచ్చాయి. కూకట్‌పల్లి జోన్‌లో అత్యధికంగా 46 ఫిర్యాదులు రాగా, శేరిలింగంపల్లి జోన్‌లో 20, సికింద్రాబాద్ జోన్‌లో 18,ఎల్బీనగర్ జోన్‌లో 15,చార్మినార్ జోన్‌లో 5, ఖైరతాబాద్ జోన్‌లో అత్యల్పంగా కేవలం ఒకే ఒక్క ఫిర్యాదు నమోదైంది. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్, సత్యనారాయణ, వేణు గోపాల్, సీసీపీ శ్రీనివాస్, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రాములు, విజిలెన్స్ ఏఎస్పీ నర్సింహా రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.