10-07-2025 12:28:17 AM
- మెగా ఆధార్ క్యాంపుకు విశేష స్పందన
- సదుపాయాలు లేక అవస్థలు
- ప్రతి మండలంలో కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం
- ఆశతో వచ్చే వెనుదరిగిన జనం
భద్రాద్రి కొత్తగూడెం జూలై 9 (విజయ క్రాంతి); భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యాలయంలో బుధవారం జన జాతర సాగింది. కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా ఆధార్ కేంద్రాలకు ఆశేష జనం హాజరయ్యారు. ఊహించని రీతిలో ఆధార్ కార్డు చేర్పులు,మార్పులకు తండోపతండాలుగా జనం రావడంతో అధికారులు అవాక్కయ్యారు. అంచనాకు మించి జనం రావడంతో మౌలిక వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి గమనించిన అధికారులు ప్రతి మండల కేంద్రంలో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని నిర్ణయించారు.
సుదూర ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు ఇళ్లకు తిరిగి వెళ్లాలని పదే పదే విజ్ఞప్తులు చేయటం గమనార్హం. చంటి పిల్లలతో, వికలాంగులతో, వృద్ధులతో సహా ఆధార్ చేర్పుల మార్పులకు జనం హాజరయ్యారు. భద్రాచలం ప్రధాన రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేరకు ఇరువైపులా వాహనాలు పార్కింగ్ చేశారంటే జనం ఏ రీతిలో హాజరయ్యారు చెప్పనవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆధార్ కార్డు మార్పులు చేర్పు లేక జనం అవస్థలు పడుతున్నారు అనడానికి ఈ దృశ్యాలే చక్కని నిదర్శనం.