16-09-2025 12:35:30 AM
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, సెప్టెంబర్ 15 (విజయ క్రాంతి): ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు .జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను సకాలం లో పరిష్కరించాలని అన్నారు.
ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధానం అందించా లని, మన పరిధిలో ఉన్న వాటికి సంబంధించి పనిని వెంటనే పూర్తి చేయాలని, మనం చేయలేని పక్షంలో దానికి గల కారణాలను, నిబంధనల వివరాలను తెలుపు తూ లేఖ రాయాలని కలెక్టర్ సూచించారు. వార్తా పత్రికలలో ప్రచురితమయ్యే వ్యతిరేక వార్తలపై క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యల వివరాలు అందించాలని, దీనిపై డిఆర్‌ఓ సమీక్ష చేయాలని అన్నారు. ఈఈ హౌసింగ్, డిఆర్డిఓ, డిపిఓ, డి.ఎం.హెచ్.ఓ, వివిధ శాఖ ల వద్ద పత్రికలలో వచ్చిన వ్యతిరేక వార్తలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన రిపోర్ట్ పెండింగ్ ఉన్నదని, వీటిని సకాలంలో సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.
గన్నవరం క్రాస్ రోడ్ లో గల రెబ్బవరం బస్టాండ్ ను ఆక్రమించారని, ఇట్టి ఆక్రమణలు తొలగించి బస్టాండ్ పునరుద్ధరించి ప్రయాణికులకు భరోసా కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతూ వైరా మండలం రెబ్బవరం, కొండకొడిమ, ఖానాపురం, గన్నవరం గ్రామాలకు చెందిన ప్రజలు దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ కు రాస్తూ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.వైరా మండలానికి చెందిన ఎస్. విద్యాసాగర్ సెమీ ఆర్ఫన్ స్టూడెంట్ కు ఎస్సి గురుకులంలో ఏడవ తరగతి సీట్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, ఆర్.సి.ఓ. కు రాస్తూ పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
వేంసూరు మండలం కందుకూరు రెవెన్యూ గ్రామ రైతులు తాము వరుణ్ అగ్రిటెక్ కంపెనీ వారి బిపిటి 2782 వరి విత్తనాలు కొనుగోలు చేసి వరి పంట సాగు చేశామని, ఎకరానికి 25 వేల చొప్పున ఖర్చు అయిందని, కల్తీ విత్తనాలు రావడం వల్ల తమ శ్రమ వృధా అయ్యిందని, కల్తీ విత్తనాలు విక్రయించిన వరుణ్ అగ్రిటెక్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి రాస్తూ విచారణ చేసి వెంటనే తగుచర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ డైలీ వేజ్, కాంటింజెంట్, పార్ట్ టైం వర్కర్స్ యూనియన్ జె.ఏ.సి. తరపున తమకు పాత పద్ధతిలో జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు, పెండింగ్ వేతనాలు చెల్లించుటకు దరఖాస్తు సమర్పించగా పి.ఓ. ఐటిడిఏ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. బోనకల్ మండలం ఆళ్ళపాడు గ్రామానికి చెందిన మరీదు శ్రీను తనకు వచ్చే దివ్యాంగుల పెన్షన్ 3 సంవత్సరాలుగా ఆగిపోయిందని, తనకు పెన్షన్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, డిఆర్డీవో కు రాస్తూ తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్‌ఓ ఏ. పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.