14-08-2025 01:57:41 AM
ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్
ముషీరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : ఇటీవల ప్రజా పదంలో పక్కా గృహాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేద ప్రజలందరికి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు బుధవారం ముషీరాబాద్ డివిజన్‌లోని మొరంబొంద ప్రాంతాని కి చెందిన ప్రజలు ఇటీవల పక్కా గృహాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఎల్ -3 అని (సొంత ఇల్లు ఉన్నాయని) అధికా రులు తప్పుడు రిపోర్టులు రాసారని స్థానికులు డివిజన్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశించడంతో ముషీరాబాద్ తహసీల్దార్ రాణాప్రతాప్ సింగ్, రెవెన్యూ అధికారులు మొరంబొందలో ఇంటింటికి వెళ్లి సర్వే చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పక్కా గృహాలకోసం 53 మంది స్థానికులు దరఖాస్తు చేసుకున్నారని, అందులో ఏ ఒక్కరికి సొంత ఇండ్లు లేవని పేర్కొన్నారు. అద్దె ఇండ్లలో నివసించే వీరి అందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని కోరారు.
ముషీరాబాద్ తహసీల్దార్ రాణాప్రతాప్ సింగ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటింటికి దరఖాస్తు దారుల వివరాల కోసం సర్వే చేస్తున్నామని తెలిపారు. పూర్తి నివేధికను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గం జా యింట్ కన్వీనర్ ఎం. నవీన్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు కంచి ముదిరాజ్, పార్టీ నాయకులు సత్యనారాయణ, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.