15-08-2025 02:01:01 AM
మంత్రికి ఫిర్యాదు చేసిన ఎస్సీ సెల్ అధ్యక్షుడు విజయ్‌కుమార్
దాడి దృశ్యాలను ఫోన్‌లో చూసిన మంత్రి
కొండపాక, ఆగస్టు 14: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌పై దాడిచేసి, కులం పేరుతో దూషించిన డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిపై పార్టీ పరమైన చర్యలు తీసుకుంటామని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. బుధవారం మంథని నుంచి హైదరాబాద్ వెళ్తున్న మంత్రి శ్రీధర్‌బాబు తన వాహనాన్ని సిద్దిపేట జిల్లా కొండపాక స్టేజి వద్ద ఆపి విజయ్‌కుమార్‌ను పరామర్శించి వివరాలు తెలుసుకు న్నారు.
ఇటీవల జిల్లాలో ఇన్‌చార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా జరిగిన రేషన్‌కార్డుల పంపిణీ సమావేశంలో తనపై దుర్భాషలాడి, దాడి చేసిన దృశ్యాలను విజయ్‌కుమార్ మంత్రికి ఫోన్‌లో చూపించారు. ఇందు కు మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ ఇలాంటి ఘటనలు పార్టీకి ఎంతమాత్రం మంచిది కాదన్నారు. గతంలో నర్సారెడ్డి విషయంలో చాలా తప్పిదాలు తమ దృష్టికి వచ్చాయని, ఈ విషయంలో అతి త్వరలో చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
పార్టీ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి పనిచేసే ప్రతి ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందన్నారు. అలాగే సీనియర్ నాయకుడు ఇక్బాల్ పలువురు మైనార్టీ నాయకులు శ్రీధర్‌బాబును కలిసి పార్టీలో తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్న నాయకులను పక్కనపెట్టి బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, జిల్లాలో పార్టీలో పరిస్థితులు బాగా లేవని వెల్లడించారు.
దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించి పార్టీలో ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని, త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరించి పార్టీ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట కాంగ్రెస్ నాయకులు గాడిపల్లి రఘువర్ధన్‌రెడ్డి, మహమ్మద్ ఇక్బాల్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఫారూక్ జానీ, నాయకులు నాగరాజు, ఎన్నెల్లి స్వామి, రవిషేక్ రఫీక్, నదీమ్ పాషా, సాయబ్, డీసీసీ ఉపాధ్యక్షులు ఏర్పుల మల్లేశం తదితరులు ఉన్నారు.