15-08-2025 12:34:04 AM
వానాకాలమొస్తే ఎక్కడోళ్లు అక్కడే..!?
గార్ల (మహబూబాబాద్), ఆగస్టు 14, (విజయ క్రాంతి): వానాకాలం వస్తే చాలు.. పాకాల వాగు ఉధృతి తో లో లెవెల్ వంతెన పై రాకపోకలు నిలిచిపోయి, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపూర్, మద్దివంచ గ్రామాల ప్రజలు ఎటోళ్లు అటే అనే తరహాలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొద్దిపాటి వర్షం కురిసిన పాకాల ఏరు పొంగి ప్రవహించడంతో లో లెవెల్ వంతెన పై రాకపోకలు స్తంభిస్తాయి.
అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఆయా గ్రామాల ప్రజలు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే గార్లకు రావాలంటే బయ్యారం వెళ్లి అక్కడ నుండి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రావాల్సిన పరిస్థితి. లేదంటే డోర్నకల్ వెళ్లి రైలు పట్టాల వెంట ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గార్ల బ్రిడ్జి పై నుండి గార్లకు చేరుకోవాల్సిన పరిస్థితి.
లో లెవెల్ కాజ్ వే స్థానంలో హై లెవెల్ వంతెన నిర్మించడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటామని.. ప్రతిసారి ఎన్నికల సందర్భంగా నేతలు హామీ ఇవ్వడం, ఎన్నికలు అయిపోగానే ఇచ్చిన హామీని విస్మరించడం నిత్య కృత్యంగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. మద్దివంచ, రాంపూర్ గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన గార్లకు రావడానికి, అలాగే విద్యార్థులు చదువు కోసం పాఠశాలకు రావడానికి వర్షాకాలంలో లో లెవెల్ వంతెన ఆటంకంగా మారింది.
వర్షాకాలంలో దాదాపు మూడు నెలల పాటు ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు గార్లకు రావడానికి అనేక అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సమయంలో ఎవరికైనా ఆపద వస్తే వారిని గార్లకు తీసుకురావడానికి పెద్ద సాహసమే చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. అటు రైలు పట్టాల వెంట ప్రమాదం పొంచి ఉండగా, ఇక్కడ లో లెవెల్ వంతెన దాటడం కూడా ప్రాణాంతకంగా మారిందని వాపోతున్నారు.
వర్షాకాలంలో వాగు దాటడం సాహసోపేతమైన చర్యగా మారిందని చెబుతున్నారు. వాగుపై లో లెవెల్ వంతెన స్థానంలో హై లెవెల్ వంతెన నిర్మించాలని వామపక్ష పార్టీలు అనేకసార్లు ఉద్యమాలు చేసినప్పటికీ పాలకులు పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు.
అభివృద్ధికి రహదారులు దోహదపడతాయని ఓవైపు చెబుతున్న పాలకులు మరోవైపు రాకపోకలకు అడ్డుగా ఉన్న లో లెవెల్ కాజ్ వే స్థానంలో హై లెవెల్ వంతెన నిర్మించడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి గార్ల - డోర్నకల్ మధ్య రాకపోకలకు అడ్డుగా మారిన పాకాల వాగు పై హై లెవెల్ వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.