15-08-2025 11:00:59 PM
కుభీర్: మండలంలోని పల్సి గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 25 వేల విలువచేసే శుద్ధ జల యంత్రాన్ని ఇదే గ్రామానికి చెందిన యువకుడు పురం శెట్టి రవికుమార్ అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. శుక్రవారం పాఠశాలలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాలలో యంత్రాన్ని బిగింపజేసి హెచ్ఎం దొంతుల సురేష్ తో కలిసి ప్రారంభించారు. పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు శుద్ధ జల సేవనంతో విద్యార్థులకు ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉండేందుకు దోహదపడతాయని పలువురు గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.
100 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ శుద్ధ జల యంత్రాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని దాత రవికుమార్ సూచించారు. ఈ సందర్భంగా రవికుమార్ ను పాఠశాల ఆధ్వర్యంలో హెచ్ఎం దొంతుల సురేష్ తో పాటు ఉపాధ్యాయులు, గ్రామస్తులు శాలువాతో సత్కరించి అభినందించారు. పాఠశాల అభివృద్ధికి గ్రామంలోని దాతలు ముందుకు వచ్చి విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తమవంతు సహాయ సహకారాలు అందించాలని హెచ్ఎం కోరారు. అంతకుముందు పాఠశాలలో గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.