20-11-2025 12:00:00 AM
-రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ఖమ్మం, నవంబర్ 19 (విజయ క్రాంతి): నాణ్యమైన పంట సత్వరమే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బుధవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి ధాన్యం, పత్తి పంటల కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో నాణ్యత పరిశీలించి కొనుగోలు చేసిన తర్వాత రైస్ మిల్లుల వద్ద ఎటువంటి కోతలు విధించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. గన్ని బ్యాగులు, టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో పెట్టుకోవాలని, ధాన్యం తేమ శాతం రాగానే వెంటనే కొనుగోలు పూర్తి చేసి రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. కౌలు రైతు వద్ద నుంచి కూడా పత్తి పంట మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు అనుసరిస్తున్న విధానాన్ని పత్తి పంట కొనుగోలుకు పాటించాలని అన్నారు.
తేమ శాతం గ్రామాలలోనే చెక్ చేసుకునేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, డిఎస్‌ఓ చందన్ కుమార్, డిసిఓ గంగాధర్, సివిల్ సప్లైస్ డి ఎం శ్రీలత, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.