19-08-2025 01:14:47 AM
యూరియా కోసం రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్,(విజయక్రాంతి): నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని, యూరియా అమ్మకాల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని, భారీ వర్షాల కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మందిరం నుండి జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా యూరియా పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు, ఆగ్రోస్ వ్యవసాయ దుకాణాల ద్వారా, ఇతర ప్రైవేటు షాపుల ద్వారా యూరియా విక్రయించాలని, అవసరం ఉన్నచోట డిమాండ్ కనుగుణంగా యూరియాను తెప్పించడం కోసం ప్రతిపాదనలు పంపామని, అందుకు అనుగుణంగా సంబంధిత మండల స్థాయి అధికారులు రైతు వివరాలు పాసుబుక్, ఆధార్ కార్డ్, ద్వారా ఆన్లైన్ విధానంలో ప్రస్తుతం ఉన్న యూరియాను సరఫరా చేయాలన్నారు. యూరియాను అధిక ధరలకు విక్రయించకూడదని, కృత్రిమ కొరత సృష్టించవద్దని ఆయన సూచించారు.
సహకార శాఖ, ఫర్టిలైజర్స్ షాప్ యజమానులు రైతులకు యంత్రాంగానికి సహకరిస్తూ ఉండాలని సూచించారు. అనవసర వదంతులను రైతులు అసలు నమ్మవద్దని తెలిపారు. కొంతమంది అక్రమ నిల్వలు చేసినట్లు, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు, తమ దృష్టికి వచ్చిందని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ కమిటీల ద్వారా నిత్యం ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేయాలని, పి ఓ ఎం ఎస్, ఆన్లైన్, గోడౌన్ నిలువలు సరిపడాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న సేల్స్, స్టాక్ వివరాలను విషయ సూచిక ద్వారా రైతులకు తెలియపరచాలని ఆయన కోరారు. సంబంధిత అన్ని విభాగాలు సమన్వయంతో కలిసి పనిచేసే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియాను పంపిణీ చేయాలని ఆయన సూచించారు.
నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని, ప్రస్తుతం వేయవలసిన యూరియా ఫర్టిలైజర్స్ గురించి స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు రైతు వేదికల ద్వారా ప్రజలకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు యూరియా అమ్మకాలు చేయాలన్నారు.
భారీ వర్షాల కారణంగా వరదలు పెరిగే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారులు ప్రధాన కార్య స్థానంలోనే ఉండాలని నిత్యం నివేదికలు సమర్పించాలని, వంతెనలు, ట్యాంకులు, లో లెవె ల్ కాజ్ వేలను నిత్యం గమనిస్తూ, ప్రజలకు వరదల వలన ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మాట్లాడుతూ జిల్లాలో పోలీస్ యంత్రాంగం అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు రైతులకు అనుక్షణం రక్షణగా ఉంటుందన్నారు. యూరియాను ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించవద్దన్నారు. వీలైతే టోకెన్ స్మార్ట్ ల ద్వారా అమ్మకాలు జరపాలని సూచించారు. పూర్తిస్థాయిలో యూరియా అమ్మకాలపై పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టిందన్నారు.