19-08-2025 12:52:42 AM
రెండేళ్లకు మించి రూ.386 కోట్లు పెండింగ్
70 మందికి పైగా ‘మన ఊరు- మన బడి’ కాంట్రాక్టర్ల విజ్ఙప్తి
హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి) : పెండింగ్‌లో ఉన్న తమ బిల్లు లు వెంటనే విడుదల చేయాలని ‘మన ఊరు బడి’ పథకంలో భాగంగా పనులు చేసిన కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. సోమవారం సచివాలయంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఛాంబర్ల ముందు బైఠాయించిన నిరసన తెలిపారు. పెండింగ్ బిల్లులను చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని 70 మందికిపైగా కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం అందించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం తీసుకొచ్చి ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని, తమకు మాత్రం చెల్లించడం లేదన్నారు. తమ ఆవేదనను కూడా పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రూ. 386 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు.
పెండింగ్ బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడం తో 10 మందికిపైగా కాంట్రాక్టర్లు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారని, బిల్లులు రాకపోతే తమకు ఆత్మహత్యే గతి అవుతుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంద ర్భంగా స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి వీలైనంత త్వరగా పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని కాంట్రాక్టర్లకు హామీ ఇచ్చారు.
ఇది ‘స్కాం’గ్రెస్ ప్రభుత్వం: మాజీ మంత్రి హరీశ్‌రావు
తెలంగాణలో పాలన సాగిస్తున్నది కాం గ్రెస్ ప్రభుత్వం కాదని, అది ‘స్కాం’గ్రెస్ ప్రభుత్వమని అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సచివాలయం ఎదుట ‘మన ఊరు మన బడి’ కాంట్రాక్టర్లు చేపట్టిన నిరసనపై ఆయన ‘ఎక్స్’ ద్వారా స్పం దించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పెం డింగ్ బిల్లులు కోసం కాంట్రాక్టర్లు రెండు సార్లు సచివాలయం ఎదుట ధర్నా చేశారని గుర్తుచేశారు. కాంట్రాక్టర్లకు ఇలాంటి పరిస్థితి రావడం దేశంలో ఇదే మొదటిసారి కావొచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ కాంట్రాక్టర్లు గతంలో కమీషన్లు ఇవ్వకపోతే ఆర్థికశాఖ మంత్రి తమ బిల్లులు క్లియర్ చేయడం లేదని ఫైనాన్స్ కార్యాలయాన్ని ముట్టడించారని గుర్తుచేశారు. కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయడంలో సీనియారిటీ పాటించకుండా, ప్రభుత్వ పెద్దలు కమీషన్లు దండు కుంటున్నారని అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుందని ప్రశ్నించారు. కాం గ్రెస్ ప్రభుత్వానికి కమీషన్ మాత్రమే టార్గెట్ అని, కాంట్రాక్టర్ల బాగోగులపై ప్రభుత్వానికి పట్టింపు లేదని పేర్కొన్నారు.