19-08-2025 01:16:02 AM
హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐ ఆధారిత సేవలకు ప్రాధాన్యమిస్తుందని, 2027 నాటికి రాష్ట్రంలో కోటిమంది పౌరులకు ఏఐ ఆధారిత సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని రాష్ర్ట ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెఆర్డీ ఇనిస్టిట్యూట్‌లో ‘ఏఐ లెడ్ డిజి టల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చాంపియన్స్ అండ్ కాటలిస్ట్స్ ప్రోగ్రామ్’ పేరిట ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్(ఐటీ శాఖ) ఆధ్వర్యంలో ప్రభుత్వాధికారులకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
తమది సమస్య వచ్చిన తర్వాత స్పందించే ప్రభుత్వం కాదని, ముందుగానే ఊహించి పరిష్కరించే చురుకైన, పారదర్శకమైన ప్రభుత్వమని పేర్కొన్నా రు. ఏఐ సహకారంతో ప్రజలు అడగకుండా నే, వారికి మెరుగైన పౌర సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తద్వారా సరికొత్త తెలంగాణను నిర్మించాలన్నదే తమ సంకల్పమన్నారు.
రాష్ట్రంలో త్వరలో 5 బిలియన్ డాలర్ల ఏఐ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా మారుతుందని, వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని ఆకాంక్షించారు. ‘ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్’గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమా ణాలతో ఏఐ సిటీ, ఏఐ యూనివర్సిటీ, తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ అందుబాటులోకి తీసుకురాబోతున్నామని హామీ ఇచ్చారు. దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్సేంజ్‌ను ప్రారం భించి, ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచామని తెలిపారు.
ఇదే స్ఫూర్తితో 20 ప్రభుత్వ శాఖలకు చెందిన 300 రకాల పౌర సేవలను ఏఐ ఆధారిత ప్లాట్ ఫాంపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అందుకు 250 మంది అధికారులను ఎంపిక చేసి, వారికి ఏఐ వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. వీరికి మూడు నెలల పాటు శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. వీరికి ఏఐ నిపుణులు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ సంజయ్‌కుమార్, డిప్యూటీ సెక్రటరీ భవేశ్‌మిశ్రా పాల్గొన్నారు.