19-08-2025 12:53:05 AM
కాగజ్ నగర్,(విజయక్రాంతి): ఈ నెల 23, 24 తేదీలలో రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలను రెబ్బెన మండలం గోలేటిలోని సింగరేణి పాఠశాల మైదానంలో నిర్వహించనున్నట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోషియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 25 నుండి 28వ తేదీ వరకు తమిళనాడులోని దిండిగల్ లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్ర జట్టును ఎంపిక చేసేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల పురుషులు, మహిళలకు సంబంధించిన 20 జట్లు హాజరు కానున్నాయని, ఇందుకు గాను గోలేటిలో పకడ్బంధీ ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే క్రీడాకారులకు గోలేటిలో ఉచిత భోజన, వసతి సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. పోటీల విజయవంతానికి క్రీడాకారులు, క్రీడాభిమానులు, జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు.