calender_icon.png 19 August, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెత్తందారీ వ్యవస్థను ఎదిరించిన యోధుడు

19-08-2025 12:09:02 AM

  1. మా డిమాండ్‌తోనే ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహం
  2. జయంతి వేడుకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): పెత్తందారీ వ్యవస్థను ఎదిరించి ధైర్యంగా నిలబడిన యోధుడు సర్వాయి పాపన్నగౌడ్ అని, పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి అమరులయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు అనేక సంఘాలు, కులాలు, వ్యక్తులు కృషి చేస్తున్నారని తెలిపారు.

పాపన్న పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. తమ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించి ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. సోమవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఓబీసీ మోర్చా, గీతా సెల్ ఆధ్వర్యంలో పాపన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి రాంచందర్‌రావు పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. ఎక్కడ అన్యాయం జరిగినా దానికి పోరాటమే మార్గమని.. ఆ పోరాటం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలని చెప్పారు. గతంలో మన దేశంపై ఎన్నో దాడులు జరిగాయని.. మహిళలపై లైంగికదాడులు, అన్యాయాలకు పాల్పడ్డారని.. అలాంటి ఘటనలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సర్వాయి పాపన్నగౌడ్ ఒక వీరుడిగా అవతరించారని గుర్తుచేసుకున్నారు. పాపన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ ఓబీసీ మోర్చా నిర్ణయించిందని వెల్లడించారు.

రాష్ర్ట ప్రభుత్వం సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే తామే పెడతామని కూడా ప్రకటించామని, ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్‌ను రాష్ర్ట ప్రభుత్వం అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి వీరేందర్‌గౌడ్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.