10-07-2025 12:00:00 AM
- చక్రం తిప్పుకున్న కీలక అధికారి
- ప్రతి పనికీ రూ.లక్షల్లో ముడుపులు
- ఫార్మా, మైనింగ్‌లో భారీగా వసూళ్లు..
- కంప్లైంట్ వచ్చిన ప్రతిసారీ పైసలే
- తలలు పట్టుకుంటున్న యాజమాన్యాలు
నల్లగొండ, జూలై 9(విజయక్రాంతి): అది కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం. అక్కడ పనిచేసే ఓ కీలక అధికారి పైసలే పరమావధిగా భావిస్తున్నారు. ప్రజారోగ్యం కాపాడడంలో కీలకంగా వ్యవహరించాల్సిన పొలుష్యన్ కంట్రోల్ బోర్డు అధికారులు.. అమ్యామ్యాలకు అలవాటుపడ్డారు. ప్రతి పనికీ ఓ రేటు ఫిక్స్ చేసి.. నెలనెలా రూ.లక్షలు గుంజుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఫార్మా కంపెనీలు, క్రషర్ మిల్లులు పెద్దసంఖ్యలో ఉన్నాయి.
దీనికి సంబంధించి ఏ చిన్నపాటి కంప్లైంట్ వచ్చినా.. ఆ అధికారికి పండుగే. తెల్లారేసరికి అక్కడ క్షణాల్లో వాలిపోతారు. కంప్లైంట్ వచ్చిన సదరు కంపెనీని ఏవేవో సాకులు చెప్పి.. రూ.లక్షల్లో ముక్కు పిండి వసూలు చేయడం ఆయన నైజంగా మారింది. దీనికితోడు క్రషర్ మిల్లులకు సంబంధించి అక్రమ మైనింగ్లను చూసీచూడనట్టు వదిలేయడం.. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే అనుమతులు ఇవ్వడం తదితర ప్రక్రియల్లో సదరు అధికారిది అందవేసిన చేయ్యిగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో క్వారీలే అధికం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో క్వారీలతో పాటు ఫార్మా కంపెనీలు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా చిట్యాల, చౌటుప్పల్, బీబీనగర్, భువనగిరి, బొమ్మలరామారం, తుర్కపల్లి, మోతే, సూర్యాపేట, కోదాడ, దేవరకొండ, కొండమల్లేపల్లి, హాలియా, పెద్దఅడిశర్లపల్లి, అనంతగిరి, నకిరేకల్ తదితర ప్రాంతాల్లో గ్రానైట్, మెటల్ క్వారీలు అత్యధికంగా నడుస్తున్నాయి.
వీటిల్లో పరిధికి మించి పేలుళ్లు చేస్తుండడం.. చిట్యాల, చౌటుప్పల్ మండలాల్లోని ఫార్మా కంపెనీలు విడుదల చేసే హాని కారక రసాయనాలతో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. మరోవైపు కట్టం గూరు మండలంలోని ఓ క్రషర్ మిల్లు నుం చి భారీగా కాలుష్యం చుట్టూ ఉన్న పంట పొలాలతో పాటు ఇండ్లను సైతం కమ్మేస్తోంది. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సదరు అధికారులు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేసిన మరుసటి రోజే క్రషర్ మిల్లుకు రావడం.. అమ్యామ్యాలు పుచ్చుకోవడం ఆపై అటువైపు తొంగి చూడకపోవడం కొసమెరుపు.
ప్రజాభిప్రాయసేకరణ లేకుండానే అనుమతులు..
నల్లగొండ జిల్లాలోని ఓ గుట్టలో క్వార్ట్జ్ను మైనింగ్ చేయాలని ఓ గుత్తేదారు కంపెనీ దరఖాస్తు చేసుకుంది. దీంతో ఈ యేడు ఫిబ్రవరిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. అయితే సదరు ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. అయినా సదరు పీసీబీ కీలక అధికారి చక్రం తిప్పి అనుమతులు ఇప్పించారని సమాచారం. సదరు అధికారి క్షేత్రస్థాయిలో ఏలాంటి పరిశీలన లేకుండానే అనుమతులు ఇచ్చేస్తున్నారు. నిజానికి మైనింగ్, ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇవ్వడంలో పీసీబీదే కీలక పాత్ర.
సదరు కంపెనీలకు అనుమతులు ఇచ్చినా.. అవి జనావాసాలకు దూరంగా ఉన్నాయా..? వాటి నుంచి స్థానికులకు కాలుష్య సమస్యలు ఎదురవుతున్నాయా..? అనే అంశాలను పీసీబీ అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ పీసీబీ అధికారులకు భారీగా డబ్బులు ముట్టజెప్పడంతోనే అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
ఫార్మా కంపెనీల నుంచి భారీగా వసూళ్లు..
ఇటీవల చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని ఫార్మా కంపెనీల కాలుష్యంపై పలు కథనాలను మీడియా సంస్థలు ప్రచురించాయి. దీన్ని ఆసరాగా చేసుకుని తెల్లారేసరికి సదరు ఫార్మా కంపెనీలపై సదరు పీసీబీ అధికారి విరుచుకుపడ్డారు. ఒక్కో ఫార్మా కంపెనీ నుంచి భారీగా వసూలు చేశారు. ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన యూనిట్ నుంచి ఒక్కరోజే రూ.లక్షకు పైగా వసూలు చేశారట. సదరు అధికారి దగ్గరి నుంచి డ్రైవర్, అటెండర్ సైతం వసూలు చేసుకున్నారని తెలుస్తోంది. ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి.. సదరు పీసీబీ అధికారి వేధిస్తుండడంతో ఆయా కంపెనీల యాజమాన్యాలు సైతం తలలు పట్టుకుంటున్నారట.