calender_icon.png 16 August, 2025 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈసీఐపై నీలినీడలు

10-08-2025 12:00:00 AM

దాల్ మే కాలా అని భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) వ్యవహా ర శైలిని, పనితీరును కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తప్పుబడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూరే విధంగా గత కొద్ది సంవత్సరాలుగా ఈసీఐ ఎన్నికల నిర్వహణలో అవకతవకలకు పాల్పడుతున్నదని రాహుల్ ఆరోపణ. గత లోక్‌సభ, మహారాష్ట్ర, హర్యా నా అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్ తరచుగా ఈసీఐని వేలెత్తి చూపుతున్నారు.

ఆయన ఆరోపణలతో ఎన్నికల నిర్వహణ తీరుపై దేశ ప్రజల కున్న విశ్వాసం ప్రశ్నార్థకంగా మారింది. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం మహదేవపుర సెగ్మెంట్ ఎన్నికల జాబితాలో వున్న అవకతవకలను రాహుల్ రెండ్రోజుల క్రితం విలేకరులకు వివరించారు. 2024 ఎన్నికల్లో మిగతా సెగ్మెంట్ల కంటే మహదేవపురలో బీజేపీకి అనూహ్యం గా ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.

ఒక గది ఉన్న ఇంటిలో పదుల సంఖ్యలో ఓటర్ల నమోదు, ఒకే ఓటరు పేరు పలుమార్లు నమోదు కావడం, ఓటర్ల ఫొటో లేకుండా, చిరునామా లేకుండా ఓటరు జాబితా తయారు చేయ డం డీకే ఓటరు పేరు పలు బూత్‌లలో దర్శనమీయడం వంటి అవకతవకల్ని రాహుల్ ఓటరు జాబితాను ముందుంచి ఎత్తిచూపారు. మిగతా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతిలో ఎన్నికల కమిషన్ బీజేపీకి ప్రయోజనం చేకూర్చిందని, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే విధంగా ఈసీఐ వ్యవహరించి తక్కువ మెజారిటీతోనైనా, బీజేపీ గట్టెక్కేలా చేసిందని రాహుల్ ఆరోపణ.

ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో తప్పులు వెరసి, భారత ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చతెచ్చేలా ఈసీఐ వ్యవహరించిందనే తీవ్ర ఆరోపణను ఆయన ముందుకు తెచ్చారు. బీహార్‌లో ఈసీఐ చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఇప్పటికే వివాదాస్పదమైన నేపథ్యంలో రాహుల్ చేసిన విమర్శలు చర్చనీ యాంశంగా మారాయి. 

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటింగ్ సమయం గడువుకు కొద్దిముందుగా ఓటర్లు బారులుతీరడం, అసలు మూడు దఫాలుగా ఎన్నికలు నిర్వహించడం బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకేనని రాహుల్ వాదన. దీనిపై తీవ్రంగా స్పందించిన ఈసీఐ, ఆధారాలలో అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. రాహుల్ చేసిన ఆరోపణల్లో పసలేదని ఈసీఐ బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నది.

ఈసీఐ అడిగినట్టుగా అఫిడవిట్ దాఖలు చేసినా, దానిపై సంతకం చేసేందుకు రాహుల్ భయపడుతు న్నారని ఇప్పుడు ఈసీఐ పరోక్షంగా ఆ ఆరోపణలు తప్పుల తడక అని చెప్పే ప్రయత్నమూ చేస్తున్నది. రాజ్యాంగ సంస్థలపై దాడి చేయడం రాహుల్‌కు మామూలేనని, ఇదీ దానిలో భాగమేనని బీజేపీ మంత్రులు, నాయకులు వెనువెంటనే స్పందించారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజాస్వామ్యం పరిఢవిల్లినట్టుగా, బీజేపీ గెలిస్తే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినట్లుగా రాహుల్ మాట్లాడుతుంటారని బీజేపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు.

రాజకీయ పార్టీల వైఖరి ఎలా వున్నా, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలని ప్రజలు కోరుకుంటారు. ఎన్నికల విధానంలో సమగ్రత కొరవడితే, ప్రజలు తమకిష్టమైన వారిని గద్దెనెక్కించే విధానమే నిష్ప్రయోజనకరంగా మారుతుంది. పోలింగ్ బూత్‌ల్లోని సీసీ టీవీ ఫూటేజీను భద్రపరచడం, అసలు ఓటర్ల జాబితాను పకడ్బందీగా తయారు చేయడం, వీవీ పాట్ విధానంలో పారదర్శకత వంటి చర్యలతో ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరుగుతున్న ఓటింగ్‌పై ప్రజల్లో విశ్వాసం కలిగించవచ్చు. అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తే, ఉన్న ప్రతిష్ట  మసకబారకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉంటుంది.