04-07-2025 12:00:00 AM
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): గోదావరి జలాలపై తెలంగాణ రైతులకు ఉన్న హక్కులకు మరణ శాసనం రాసేలా ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మౌనం వహించడం కుట్రపూరితమే అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఏడాది పూర్తి చేసుకుంటున్న తరుణంలో రాహుల్‌గాంధీ రాష్ట్ర ప్రజలకు చేసిన ద్రోహాం తీవ్రరూపం దాల్చిందని గురువారం ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.
తెలంగాణ సమస్యలను, విభజన చట్టంలో నెరవేరని హామీలపై ఒక్కసారిగా కూడా లోక్‌సభలో ఆయన లేవనెత్తలేదని విమర్శించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా, బయ్యారం ఉక్కు కార్మాగారం గురించి అయినా ఒక్కసారి కూడా ఆయన ప్రశ్నించలేదని కేటీఆర్ మండిపడ్డారు.
రాష్ట్రంలో 420 హామీలను ప్రకటించిన తర్వాత నీడలాగా రాహుల్‌గాంధీ మాయమైపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆకాంక్షలు నీరుగారిపోతుంటే కాంగ్రెస్ అధికారం మత్తులో మునిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరితహారంతో పచ్చని స్వర్గసీమగా తెలంగాణ
ఒక చిన్న మొక్క నిశ్శబ్దంగా అడవికి జన్మనిస్తుంది అనడానికి తెలంగాణలో విజయవంతమైన హరితహారం నిదర్శనమని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా జూలై 3, 2015న మొదలైన హరితహారంతో తెలంగాణ పచ్చని స్వర్గసీమగా మారిందన్నారు. రాబోయే తరాలకు అద్భుతమైన పరిసరాలను అందించాలన్న సంకల్పం పదేండ్ల స్వల్పకాలంలోనే హరితహారంతో సాకారమైందని గురువారం ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు.
హరితహారం లక్ష్యం ఒక మొక్కను నాటడమో లేదంటే ఒక వనాన్ని సంరక్షించడమో కాదని, తెలంగాణలోని ప్రతీ మూలను పచ్చదనంతో నింపడమే అని అన్నారు. తమ హయాంలో రాష్ర్టంలో పచ్చదనం 24శాతం నుంచి 33శాతానికి పెరిగిందన్నారు.
19,472 గ్రామ పంచాయతీలు, 143 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో నర్సరీలు, ప్రకృతి వనాలను తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. తమ ప్రభుత్వ కృషితో ఇవాళ తెలంగాణలో అటవీ విస్తీర్ణం 6.85 శాతం, చెట్ల విస్తీర్ణం 14.51 శాతం, పచ్చదనం 7.7 శాతం పెరిగిందన్నారు.