10-12-2025 01:33:00 AM
డీఆర్‌ఎంను కలిసిన సాధన కమిటీ సభ్యులు
మహబూబాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): రైల్వే శాఖ ద్వారా మంజూరైన రైల్వే మెగా మెయిన్ టెనన్స్ డిపో నిర్మాణం మానుకోట లోనే నిర్మించాలని, భారీ ప్రాజెక్ట్ ను ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నాల్ని నిలుపుదల చేయాలని కోరుతూ రైల్వే మెగా మెయింటనెన్స్ డిపో సాదన కమిటీ ఆద్వర్యంలో సికింద్రాబాద్ రైల్ నిలయంలో డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణన్, సంబందిత ఐ ఆర్ ఎస్ ప్లానింగ్ అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు.
సాదన కమిటీ కన్వినర్ డాక్టర్ డోలి సత్యనారాయణ, కో. ఆర్డినేటర్ మైస శ్రీనివాస్, కో కన్వీనర్ లు పిల్లి సుధాకర్, గుగ్గిళ్ల పీరయ్య, గోనె శ్యామ్ తదితరులు కలిసి రైల్వే ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు మహబూబాబాద్ ప్రాంతం అనువైందని, ప్రత్యేకించి గిరిజన ప్రాంతంగా అత్యంత నిరాదారణకు గురై గత 70 ఏళ్ళుగా ఎటువంటి పరిశ్రమ అభివృద్ధి కి నోచుకోని ప్రాంతానికి ఈ రైల్వే మెగా ప్రాజెక్ట్ వస్తే ఈ ప్రాంత అభివృద్ధి తో పాటు, ఉద్యోగ, ఉపాది అవకాశాలకు అవకాశం ఉంటుందన్నారు.
ప్రత్యక్షంగా పరోక్షంగా మారుమూల గిరిజన ప్రాంతమైన మానుకోట రైల్వే మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు వల్ల అభివృద్ధి సాధిస్తుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, మెగా మెయింటెనెన్స్ డిపో ను ముందుగా ప్రతిపాదించిన మానుకుంట ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలన్నారు. దీనికి రైల్వే ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు మెగా మెయింటెనెన్స్ డిపో సాధన కమిటీ ప్రతినిధులు తెలిపారు.