04-11-2025 06:25:08 PM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో మిర్జాగూడలో జరిగిన ఆర్టీసీ బస్సు-టిప్పర్ ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు నమోదు చేసింది. డిసెంబర్ 15 లోపు ఘటనపై నివేదిక ఇవ్వాలని చైర్‌పర్సన్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని కమిషన్ రవాణా, హోం, మైన్స్ & జియాలజీ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), రంగారెడ్డి జిల్లా కలెక్టర్, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వంటి కీలక విభాగాలనుం ఆదేశించింది.
కమిషన్ పునరావృతమయ్యే ప్రమాదాలు, రోడ్డు భద్రతలో తీవ్ర నిర్లక్ష్యం, అమలు వైఫల్యాలు, మౌలిక సదుపాయాల జాప్యాలు ఆర్టికల్ 21 కింద జీవించే హక్కును ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. సంబంధిత అధికారులు నవంబర్ 15న ఉదయం 11 గంటలకు వాస్తవ, చర్య తీసుకున్న నివేదికలను సమర్పించాలని రవాణా శాఖ, హోంశాఖ భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. కంకరతో వెళ్తున్న టిప్పర్ టీజీఎస్ఆర్టీసీ(TGSRTC) బస్సును ఢీకొనడంతో టిప్పర్ లోని కంకర బస్సులోని ప్రయాణికులపై పడింది. దీంతో టిప్పర్, బస్సు డైవర్లతో సహా 19 మంది మరణించారు. మృతుల్లో 10 నెలల శిశువు, తల్లి కూడా ఉందన్నారు.