26-07-2025 05:07:39 PM
- రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన..
కరీంనగర్ (విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీ(Satavahana University)ని మరింత అభివృద్ధి చేసేందుకు ముందుంటానని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. శనివారం శాతవాహన యూనివర్సిటీలోని పరిపాలన విభాగం మొదటి అంతస్తుకు 9 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అలాగే యూనివర్సిటలో అంతర్గత నీటి సరఫరా పైపులైన్ ఏర్పాటు కోసం 2.10 కోట్ల రూపాయల వ్యయంతో శంకుస్థాపన, లెనోవేషన్ చేసిన ఆడిటోరియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తాను మార్కెఫెడ్ చైర్మన్ గా ఉన్నప్పుడు శాతవాహన యూనివర్సిటీ కోసం ఈ స్థలాన్ని చూపెట్టి 200 ఎకరాలు సేకరించి 2008 వైఎస్సార్ హయాంలో శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు యూనివర్సిటీకి కాంపౌండ్వాల్ నిర్మాణం, ఫుడ్ సైన్స్ కోర్సును తీసుకురావడం జరిగిందన్నారు.
2004-09 మధ్య వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ జీవన్ రెడ్డి, తర్వాత వచ్చిన ఇంజనీరింగ్ కళాశాల శ్రీధర్ బాబు తీసుకుపోయారని అన్నారు. చాలాకాలం తర్వాత హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీ, శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజీ తెచ్చుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనిరవ్సిటీ, ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. కుల గణన సర్వే ద్వారా మాతృ భాష, జాతీయ భాష, అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఏ భాషకు మేము వ్యతిరేకం కాదని అన్ని నేర్చుకోవాలని, కాంపిటీటివ్ ముందుకు వెళ్లాలంటే ఇంగ్లీష్ లో శిక్షణ పొందాలన్నారు.
పనిలో స్కిల్స్ ఉంటే లక్ష రూపాయలు జీతాలు కూడా వస్తున్నాయని, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయన్నారు. శాతవాహన యూనివర్సిటీకి ఫార్మసీ, లా, ఇంజనీరింగ్ కాలేజీ వచ్చాయని, జిల్లా మంత్రలు, ఎమ్మెల్యేలు యూనివర్సిటీకి అభివృద్ధి చేస్తున్నామన్నారు. శాతవాహన యూనివర్సిటీ తెలంగాణలోనే అత్యున్నత స్థానం పొందేలా విద్యార్థులు, అధ్యాపకులు అందిపుచ్చుకోవాలన్నారు. పోటీ ప్రపంచంలో మీ గమ్యాన్ని చేర్చుకునేలా కష్టపడాలన్నారు. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మార్చిలోపు ఇంకో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. గురుకులాల్లో చదివే పిల్లలకు మెస్ చార్జీలు పెంచామని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నామన్నారు. శాతవాహనులు పరిపాలనించిన గడ్డ అని, ఇక్కడ వారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకుందామన్నారు. శాతవాహన ఉత్సవాలు కరీంనగర్ లో ఘనంగా జరుపుకుందామన్నారు. జిల్లా కేంద్రం బిడ్డగా యూనివర్సిటీని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. జిల్లాలో నాలుగు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు, కోరుట్లలో వ్యవసాయ కాలేజీ ఉందన్నారు.
తానుఏ ఎంపీగా ఉన్నప్పుడు కరంనగర్, సిరిసిల్లకు రెండు కేంద్రీయ విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, పాస్పోర్టు ఆఫీస్, తిరుపతికి రైలు తీసుకువచ్చానని అన్నారు. రాజకీయాలకతీతంగా ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ విద్యకు సంబంధించిన సమస్యలు ఎదురైనా మా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. డిసెంబర్ 4న ముఖ్యమంత్రి పెద్దపల్లి వచ్చినప్పుడు లా కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ ప్రకటన చేశారని, చాలా సంవత్సరాలుగా లా కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ కోసం తిరిగామని అన్నారు. శాతవాహన యూనివరిసటీ ఇంజనీరింగ్ కాలేజీలో 240 సీట్లకు 160 సీట్లు మొదటి ఫేజ్ కౌన్సెలింగ్లో నిండాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, వీసీ ఉమేష్ కుమార్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.