26-07-2025 04:55:26 PM
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్(District Collector Jitesh V. Patil) అన్నారు. శనివారం కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల తరగతులు, వసతి గృహాలు, భోజనాల గది, మరుగుదొడ్లు, మంచినీటి వసతి తదితర సదుపాయాలను నిష్ణాతంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, భోజన నాణ్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులతో మమేకమవుతూ వారి అభిప్రాయాలు, ఆవశ్యకతలు తెలుసుకున్నారు. భోజనం నాణ్యత, వసతి సౌకర్యాలు, విద్యా విధానం వంటి అంశాలపై వారికి ప్రశ్నలు వేశారు. విద్యార్థుల సమాధానాలను స్వయంగా నోట్ చేసుకుంటూ, తక్షణమే సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు.
భోజనశాలలో బెంచీలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయం గమనించిన కలెక్టర్ త్వరలోనే అవసరమైన బెంచీలు భోజనశాల కోసం, కంప్యూటర్ ల్యాబ్ కోసం ఐరన్ స్టూల్స్ అందజేస్తానని హామీ ఇచ్చారు. వర్షాకాలం కారణంగా పాఠశాల ప్రాంగణంలో చిత్తడిగా ఉండటం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి, రూఫ్‌తో కూడిన టైల్స్ రోడ్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం 7వ, 8వ, 9వ తరగతుల విద్యార్థులతో పరస్పర సంభాషణ జరిపారు. విద్యా సంవత్సరానికి అనుగుణంగా నిర్వహిస్తున్న “బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్” కార్యక్రమంలో విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక వస్తువులను పరిశీలించి, వారి ప్రతిభను అభినందించారు. వారి ఆలోచనా శైలి ప్రశంసనీయం అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సాంఘిక సంక్షేమ బాలికల విద్యా అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిష్ఠతో పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. పాఠశాలల నాణ్యతపై నిరంతర సమీక్ష జరుగుతోంది. కలెక్టర్ పర్యటనవి సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మైథిలి, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.