29-09-2025 12:19:58 AM
-యువ క్రీడాకారుల గుండెకు లభించనున్న మరింత భద్రత
-500 మంది చిన్నారులకు ప్రాణం పోసిన ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28(విజయక్రాంతి): రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ (ఆర్ సీహెచ్‌ఐ) వరల్ హార్ట్ డే (ప్రపంచ హృదయ దినోత్సవం) పురస్కరించుకుని తమ రెయిన్‌బో అథ్లెటిక్ హార్ట్ క్లినిక్‌ను ఘనంగా ప్రారంభించింది. క్రీడాకారులు, పిల్లల కోసం అత్యాధునిక గుండె సంరక్షణ సేవలను అందించడానికి ఈ ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. చురుకుగా ఉండే చిన్నపిల్లల్లో గుండె సంరక్షణకు పెరుగుతున్న ప్రత్యేక అవసరాన్ని తీర్చాలని ఈ క్లినిక్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని ప్యూర్ లిటిల్ హారట్స్ ఫౌండేషన్ (పీఎల్ హెచ్‌ఎఫ్) సహకారంతో ఆర్సీహెచ్‌ఐలో నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం, కార్డియోపల్మనరీ ఎక్స్సజ్ టెస్టింగ్ ప్రాక్టికల్ వర్క్ షాప్ కూడా నిర్వహించారు.
కాగా పీఎల్‌హెచ్‌ఎఫ్‌ను ఫిబ్రవరి 2022లో స్థాపించారు. ఇది గుండె శస్త్రచికిత్సలు, చికిత్సలు అవసరమయ్యే నిరుపేద నవజాత శిశువులు, పిల్లలకు సహాయం చేస్తుంది. ఇప్పటివరకు, ఈ ఫౌండేషన్ 500 మందికి పైగా పిల్లలకు ప్రాణాలను రక్షించే గుండె శస్త్రచికిత్సలు, చికిత్సా ప్రక్రియలలో సహాయం చేసింది. ఈ వార్షిక ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల (సీహెచ్ డీస్) ప్రాబల్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే, ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్స గురించి అవగాహన పెంచారు. అంతేకాక, పిల్లలు, కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రోత్సహించారు. నాగరాణి చావా, సుకృతి వేణి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, రెయిన్ బో అథ్లెటిక్ హార్ట్ క్లినిక్‌ని గోపీచంద్ పుల్లెల ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్ డా. దినేష్ చిర్ల మాట్లాడుతూ, పిల్లలు చురుకైన జీవనశైలిని కొనసాగించేందుకు అత్యున్నత రోగ నిర్ధారణ, నివారణ సేవలను అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. జాతీయ ఉత్తమ బాల నటి పురస్కార గ్రహీత సుకృతి వేణి బండ్రెడ్డి మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లల గుండె ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, సమతుల్య ఆహారం, చురుకైన ఆటలు దీర్ఘకాలిక ఆరోగ్యానికి కీలకమని పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ దిగ్గజం గోపీచంద్ పుల్లెల క్లినిక్‌ను ప్రశంసిస్తూ, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులపై అవగాహన పెంచాలని, క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించాలని సూచించారు.ప్యూర్ లిటిల్ హారట్స్ ఫౌండేషన్ 500 మంది పిల్లలకు ప్రాణరక్షక గుండె చికిత్సలు అందించిన సేవలను గోపీచంద్ కొనియాడారు. పిల్లలు, తల్లిదండ్రు లు, వైద్యులు, దాతలతో సహా 150 మంది హాజరై, గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. భారత బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్ గోపీచంద్ పుల్లెల, జాతీయ ఉత్తమ బాల నటి పురస్కార గ్రహీత సుకృతి వేణి బండ్రెడ్డి, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ డైరెక్టర్ డా. దినేష్ చిర్ల, లారస్ ల్యాబ్స్ సీఈఓ చావా సత్యనారాయణ, ఎన్‌ఎస్‌ఎన్ ట్రస్ట్ ధర్మకర్త మరియు పీఎల్హెచ్‌ఎఫ్ దాత నాగరాణి చావా, ప్యూర్ లిటిల్ హారట్స్ ఫౌండే షన్ చైర్‌పర్సన్ యుగంధర్ మేక, యూనివర్సిటీ ఆఫ్ కొలంబో (శ్రీలంక) స్పోరట్స్ అండ్ ఎక్స్సజ్ మెడిసిన్ ప్రొఫెసర్ డా. చతురంగ రణసింగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.