09-08-2025 06:33:33 PM
ఘనంగా యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం..
మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలోని అన్ని వాడాల్లోని దేవాలయాలు యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో శనివారం ఘనంగా నిర్వహించారు. తమ్మి చెరువు కట్ట వీడియోని శ్రీ వీర హనుమాన్ ఆలయ ప్రాంగణంలో వేదమూర్తులైన అవధానుల పురుషోత్తం, కిషోర్ లు హోమగుండం ఏర్పాటు చేసి శాస్త్రృత్తంగా వేదమంత్రాలతో నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ జంధ్యాల పౌర్ణమి రోజునే రాఖీ పౌర్ణిమ జరుపుకుంటారని, సోదరుల చేతికి అక్క చెల్లెలు రక్షబంధన్ కడతారని, అలాగే వస్తున్న ఈ సంస్కృతికి ఎంతో ప్రాధాన్యత నెలకొందని, ఈ పండుగ ద్వారా సోదరీ సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు ఎంతో బలపడతాయని, ఈ రాఖీ పౌర్ణమి ప్రాశస్ధానికి నిదర్శనంగా నిలుస్తుందని, రాఖీ పండుగ తోబుట్టువుల అనుబంధానికి ప్రతీక అని, రక్షాధారణలో జగద్రక్షుడి రక్షణ దాగి ఉంటుందని సనాతన ధర్మం ద్వారా తెలుపబడిందన్నారు.
యజ్ఞోపవీత ధారణ విశిష్టత:
దక్షిణాయనంలో శ్రావణ పూర్ణిమరోజు సూర్యధ్యానం చేస్తారు. వేదవిద్యలను ఆరంభిస్తారు. శ్రావణ పూర్ణిమనాడు ద్విజులే కాక ఆలయాల్లోని దేవతామూర్తులు కూడా నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తారు. దేవతల అలంకారంలో యజ్ఞోపవీతం కూడా ఒకటి. ఈ రోజు ఆలయాలలో పవిత్రారోపణం చేస్తారు. తొమ్మిది పోగులతో చేసిన నూలు దారాన్ని నవసూత్రం అంటారు. దేవతామూర్తికి మోకాళ్ల పర్యంతం ఇరవై నాలుగుసార్లు వేస్తే అది ఉత్తమ పవిత్రమవుతుంది. ఈ నవసూత్ర యజ్ఞోపవీతాన్ని ఆలయాలలో దేవతామూర్తులకు ధరింపచేస్తారు. అలాగే ద్విజులు ఆనాడు నూతన యజ్ఞోపవీతధారణ చేస్తారు.
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేః యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతంలోని గ్రంథిని బ్రహ్మముడి అంటారు. ఆ ముడిచివర గాయత్రి ఉంటుంది. జంధ్యం బ్రహ్మతేజస్సు, వర్ఛస్సు, ఆయుష్షు, యశస్సు అనుగ్రహిస్తుంది. శ్రావణ పూర్ణిమ రోజునే కాకుండా అశౌచ సందర్భాలలో కూడా నూతన యజ్ఞోపవీతం ధరించాలి. జీర్ణమైన యజ్ఞోపవీతాన్ని ఎక్కువ కాలం ధరించకూడదు. కొత్త జంధ్యం వేసుకున్న తరువాత పాతజంధ్యంతో కలిపి పట్టుకుని గాయత్రీ మంత్రాన్ని జపించాలి. తద్వారా నూతన యజ్ఞోపవీతం శక్తివంతం అవుతుంది. ఆ తరువాత పాత జంధ్యాన్ని తులసి కోటలో కానీ, ఇంటిపైకప్పుపై కానీ ఎవరూ తొక్కని చోట పారవేయాలి. శ్రావణ పౌర్ణమినాడు జంధ్యం మార్చుకుని యధాశక్తి గాయత్రీ మంత్ర జపం చేయడం సనాతన సాంప్రదాయంగా భావిస్తారు.