09-08-2025 07:59:10 PM
తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిషోర్..
మహబూబాబాద్ (విజయక్రాంతి): కార్డెన్ సర్చ్ ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిషోర్(DSP Krishna Kishore) అన్నారు. శనివారం తెల్లవారుజామున మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్ననాగారంలో జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ఆదేశాల మేరకు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇల్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వచేసిన 4 క్వింటాళ్ల నల్ల బెల్లం, 20 లీటర్ల నాటుసారా, 20వేల రూపాయల విలువైన మద్యం సీసాలు, సరైన ధృవపత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. అలాగే గుడుంబా తయారీ కోసం నిలువచేసిన 4 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ ప్రజలకు పలు సూచనలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం తీసుకునే చర్యలపై అవగాహన కల్పించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా స్వేచ్ఛా, నిష్పక్షపాతంగా, హింసా రహితంగా జరగాలని, ఎటువంటి అక్రమ చర్యలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నేరాలు, దొంగతనాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలకమని, ప్రతి ఇంటి ముందు, దుకాణాల వద్ద, వీధుల్లో వీటిని ఏర్పాటు చేసుకోవాలని కోరారు. గంజాయి, పొగాకు, ఐడీ లిక్కర్ వంటి మత్తు పదార్థాలు వ్యక్తిగత ఆరోగ్యాన్ని, కుటుంబ శాంతిని, సమాజ శాంతిని దెబ్బతీస్తాయని వివరించారు. వీటిని వాడేవారిపై, విక్రయించేవారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అపరిచిత లింకులు క్లిక్ చేయకూడదని, తెలియని నంబర్ల నుండి వచ్చిన కాల్స్‌లో వ్యక్తిగత/బ్యాంక్ వివరాలు చెప్పకూడదని సూచించారు. నకిలీ లాటరీలు, ఉద్యోగ ఆఫర్లు, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏ అనుమానం వచ్చినా సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని పిలుపునిచ్చారు. అలాగే నంబర్ ప్లేట్లు లేని వాహన యజమానులు తక్షణం తమ వాహనాలకు సరైన డాక్యుమెంట్లు, నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నియమాలు పాటించని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ శాఖ ప్రజల భద్రత కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, ప్రజలు కూడా చట్టాలను పాటించి, నేర రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గణేష్, నెల్లికుదురు ఎస్సై చిర్ర రమేష్ బాబు, దంతాలపల్లి ఎస్సై రాజు, నరసింహుల పేట ఎస్సై సురేష్, పెద్ద వంగర ఎస్సై క్రాంతి కుమార్, తొర్రూర్ సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.