రాళ్లవాగును దోచేస్తున్నారు!

18-04-2024 03:27:23 AM

l బండలు కొట్టి యథేచ్చగా తరలింపు

l చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం 

మంచిర్యాల, ఏప్రిల్ 17(విజయక్రాంతి): జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న రాళ్లవాగులో అక్రమ దందా యథేచ్చగా సాగుతోంది. పగలు, రాత్రి అనే తేడాలేకుండా ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. ఇసుక తరలించగా బండలు తేలడంతో వాటిని సైతం వదలడం లేదు. బండలను చిన్నగా పగులగొట్టి తరలించుకుపోతున్నారు. ప్రతి రోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల సహాయంతో బండ తరలిపోతున్నా సంబంధిత శాఖ అధికారులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది.

బండలుగా కొట్టి తరలింపు 

అక్రమార్కులు వాగులో పగలంతా బండలను చిన్నచిన్నగా కొట్టి.. సాయంత్రం, రాత్రిళ్లు తరలిస్తున్నారు. మంచిర్యాల, క్యాథనపల్లి, నస్పూర్ మున్సిపాలిటీల్లో రోజు రోజుకు గృహ నిర్మాణాలు పెరుగుతున్నాయి. ముందుగా ఆర్డర్లు తీసుకొని ఈ బండను తరలిస్తుంటారు. మిగతా సమయాల్లో బండలను కుప్పలుగా పోసి ఉంచుతారు. వాటిని సీజన్‌లో కస్టమర్లు అడిగిన వారికి సరఫరా చేస్తుంటారు. ఒక్కో ట్రిప్పుకు దూరాన్ని బట్టి రూ.3,500 నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారు.

పట్టించుకోని అధికారులు 

రాళ్ల వాగులోంచి ప్రతి రోజు పెద్ద మొత్తంలో బండ అక్రమ దందా సాగుతుంది. ఇదంతా సంబంధిత శాఖ అధికారుల కనుసన్నుల్లోనే సాగుతుండటంతో అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మంచిర్యాల, గద్దెరాగడి నుంచి మందమర్రి మండలం తిమ్మాపూర్, బొక్కలగుట్ట వరకు రాళ్లవాగుపై జరుగుతున్న ఈ అక్రమ దందాపై ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి, ప్రభుత్వ వనరులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. మరోవైపు బండలను తీస్తుండటంతో వాగులో పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. అధికారులు ‘మామూలు’గా తీసుకోవడం వల్లనే ఈ దందా మూడు పువ్వులు  ఆరు కాయలుగా సాగుతుందనే ఆరోపణలు వెలువడుతున్నాయి.

చర్యలు తప్పవు 


అక్రమంగా వాగుల నుంచి ఇసుక, బండ తరలిస్తే చర్యలు తప్పవు. రాళ్లవాగులో బండ తరలింపు ఇంత వరకు మా దృష్టికి రాలేదు. బండ అక్రమ నిలువలు, రవాణా చేస్తున్న వాహనాలపై దృష్టిసారిస్తాం. సహజ వనరుల దోపిడీకి పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదు. ప్రజలు ఇలాంటివి ఏమైనా జరిగితే మాకు సమాచారం అందించాలి. అక్రమార్కుల ఆగడాలు అరికట్టేందుకు సహకరించాలి.

మోహన్ రెడ్డి, మైనింగ్ ఏడీ, మంచిర్యాల