07-11-2025 01:23:19 AM
-గుండె ప్రధాన రక్తనాళం బ్లాక్
-ఎండోవాస్క్యులర్ పద్ధతిలో వైద్యం
-ప్రాణాలు కాపాడిన కిమ్స్ సన్‌షైన్ వైద్యులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ హార్ట్ ఇనిస్టిట్యూల్ ఆధ్వర్యంలో 58 సంవత్సరాల వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, హెచ్ ఓడి కార్డియాలజీ, కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్‌కు చెందిన 58 సంవత్సరాల వ్యక్తి గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం ఆయోర్దాలో ఆన్యురిజంతో బ్లాక్ ఏర్పడింది.
ఈ పరిస్థితుల్లో మొదట మరో హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్‌కు వచ్చారు. ఆ వ్యక్తి ఆయోటాలో 13.5 సెంటీమీటర్ల మేర ఆన్యురిజంతో బ్లాక్ ఏర్పడింది. దీంతో రోగి ఎడమ వైపు ఒక లంగ్ పూర్తిగా పనిచేయకుండా అయిపోయింది. డాక్టర్ శ్రీధర్ కస్తూరి నేతృత్వంలో మినిమల్లీ ఇన్వేజివ్ విధానం, ఒపెన్ సర్జరీని కలిపిన హై బ్రీడ్ చికిత్సా విధానంలో రోగి కుడి కాలు రక్త నాళం ద్వారా గుండె రక్తనాళం అయోర్టాలో బ్లాక్ అయిన ప్రాంతాన్ని మొత్తంగా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు వివిధ రకాల బెలూన్లు ఉపయోగించి ఎండోవాస్క్యులార్ గ్రాఫ్ట్ అమర్చి శస్త్రచికిత్స చేశారు.
గుండెకు రక్తసరఫరా ఆగకుండా చూస్తూ 13 గంటల పాటు శస్త్రచికిత్సను విజయంతంగా నిర్వహించారు. ఇలాంటి హై రిస్క్ శస్త్రచికిత్సలు నిపుణులైన డాక్టర్లు, అన్ని సదుపా యాలున్న సెంటర్‌తో పాటు టీం అప్రోచ్ ఉంటేనే సాధ్యం. ఇప్పుడు రోగి ఆరోగ్యంగా ఉన్నాడని రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతున్నాడని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ శైలేందర్ సింగ్, డాక్టర్ పి.ఎన్.రావు, డాక్టర్ సందీప్ జనార్థన్, డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ రాజారాం, డాక్టర్ ప్రణయ్, డాక్టర్ పార్థసారధి, డాక్టర్ కావ్య అన్నపరెడ్డి, హార్ట్ ఇన్సిస్టిట్యూట్ ఏవిపి చందర్ తేజావత్ పాల్గొన్నారు.