07-07-2025 11:59:50 PM
రష్మిక మందన్న వరు స సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. పుష్ప, యానిమల్, ఛావా సినిమాలతో సూపర్ సక్సెస్‌ను అందుకున్న ఈ బ్యూటీ ఇటీవల ‘కుబేర’తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకుంది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటున్న రష్మికకు మాతృభాషా ప్రాంతం నుంచి మాత్రం తరచూ తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.
రష్మిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే ఆ తెగ వారి కోపానికి కారణమయ్యాయి. రష్మికను ఇరకాటంలో పడేసిన ఆ కొడవ గొడవ ఏంటంటే.. “కొడవ సమాజం నుంచి చిత్ర పరిశ్రమలోకి వచ్చిన ఏకైక వ్యక్తిని నేనే. త వర్గం నుంచి ఎవరూ ఇండస్ట్రీలోకి రాలేదు. నేను ఆడిషన్స్ ఇస్తున్న సంగతి గానీ, సినిమాల్లోకి వెళ్తాననే విషయం గానీ నేను ముందే ఇంట్లో చెప్పలేదు” అని చెప్పుకొచ్చింది.
అయితే, ఇప్పటికే కొడవ కమ్యూనిటీ నుంచి ఎంతో మంది ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపు అందుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక కంటే ఎంతో కాలం ముందే ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ ప్రేమ కూడా కొడవ జాతి మహిళేనని పేర్కొంటున్నారు.
అంతేకాకుండా ఇదే జాతికి చెందిన గుల్షన్ దేవయ్య బాలీవుడ్‌లో నటుడిగా ఉన్నారు. రష్మిక చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారి అందరూ తనను ట్రోల్ చేసేందుకు కారణమయ్యాయి. ఇదిలా ఉండగా కొడవ సామాజిక వర్గానికి చెందిన హర్షిక పూనాచ మాత్రం రష్మిక ఏదో తెలియక అలా మాట్లాడిందని, ఆమెను క్షమించేసేయాలని కోరింది.