16-09-2025 12:00:00 AM
భయాందోళనలో విద్యార్థులు
దేవరకద్ర, సెప్టెంబర్ 15 : మండల పరిధిలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో జరిగిన ఘటన కలకలం సృష్టిస్తోంది. రాత్రి నిద్రిస్తున్న నలుగురు విద్యార్థిను లను ఎలుకలు కరిచాయి. ఈ సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 14న రాత్రి 5, 6.7.8. తరగతులు చదువుతున్న నలుగురు విద్యార్థుల అరికాళ్ళకు ఎలుకలు తీవ్రంగా కరిచాయి.
పాఠశాల ఆవరణలో ఉన్న అపరిశుభ్రత, చెత్తాచెదారం కారణంగానే ఎలుకలు హాస్టల్ గదుల్లోకి ప్రవేశించాయని తెలుస్తోంది. ఈ దాడి జరిగిన వెంటనే విద్యార్థులకు చికిత్స చేయించడంలో జాప్యం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన రాత్రి జరిగితే, మధ్యాహ్నం వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో టెటనస్ టాక్సాయిడ్ టీ టీ వ్యాక్సిన్ ఇచ్చారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన
ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో కూడా ఇతర గురుకుల పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు జరిగాయని, అయినా అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.
పాఠశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని, విద్యార్థుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎలుకల బెడద లేకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని కోరుతున్నారు.