16-09-2025 12:00:00 AM
-అక్రమాలకు అడ్డాగా రైస్ మిల్లులు
-బియ్యం ఇవ్వని కృష్ణసాయి రైస్ మిల్
-రూ.6.3కోట్ల విలువైన బియ్యం పక్కదారి
-వికారాబాద్ జిల్లాలోని 30 రైస్ మిల్లుల్లో రూ.200 కోట్ల బియ్యం గాయాబ్
-రైస్ మిల్లర్ల గుప్పిట్లో అధికారులు
-అక్రమార్కులపై చర్యలు నిల్
వికారాబాద్, సెప్టెంబర్-15: సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అప్పగించడంలో రైస్ మిల్లర్ల యజమానులు జాప్యం చేస్తున్నారు. ఇదే అదునుగా భావించి కొందరు అక్రమార్కులు ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారు. రెండేళ్లుగా రైస్ మిల్లుకు వడ్లు పోతున్నా తిరిగి బియ్యం రాలేదు. సీఎంఆర్ కు బియ్యం అప్పగించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్న సంబం ధిత అధికారులు దృష్టి సారించకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ప్రభుత్వ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వికారాబాద్ జిల్లా లో సీఎంఆర్ రైస్ పక్కదారి పట్టాయి. 2022 నుంచి 23 వరకు ఖరీఫ్ సీజన్లో జిల్లాలోని పలు మిల్లర్లకు ధాన్యం అప్పగించి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ బియ్యం అందని పరిస్థితి నెలకొంది. ఈ జాప్యంపై సంబంధిత అధికార యంత్రాంగం ఏ మాత్రం దృష్టి సారించలేదు. అక్రమమార్గంలో రూ.6.38 కోట్ల విలువచేసే రైస్ ను పక్కదారి పట్టించినట్లు అంచనా. గత ప్రభుత్వంలోని పెద్దలకు సంబంధించిన బంధువుల రైస్ మిల్లర్లకు ధాన్యం అధికంగా తరలించినట్లు, అందుకు అధికారులు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా వందల కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం రికవరీ పెండింగ్ లో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే సంబంధిత అధికారులు మాత్రం ఈ విషయంపై పెద్దగా స్పందించకపోవడం గమనర్హం.
బ్లాక్ మార్కెట్‌కు బియ్యం
గత కొన్ని సంవత్సరాలుగా ధాన్యం అధికంగా పండిస్తుండటంతో రైస్ మిల్లుల సంఖ్య కూడా పెరిగిపోయాయి. ఇదే అవకాశం గా భావిస్తున్న రైస్ మిల్ యజమానులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి సీఎంఆర్ కు అప్పగించకుండా అక్రమమార్గంలో బియ్యా న్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. కోట్లల్లో వ్యాపారం చేస్తూ తక్కువ కాలంలో కోట్లు సంపాదించు కోవాలనే ఆలోచన ఉన్న వారు ఈ వ్యాపారంలో దిగుతున్నారు.
అంతే కాకుండా రాజకీయ నేతల అండదండలు కూడా వీరికి పుష్కలంగా ఉంటు న్నాయి. వికారాబాద్ జిల్లాలోని రైస్ మిల్లర్ల యాజమాన్యం ప్రభుత్వ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలు కూడా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. నిర్దేశించిన సమయంలో కేటాయించిన ధాన్యానికి బియ్యం డెలివరీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఎగవేతకు పాల్పడుతున్నారు.
రెండేళ్లు గడిచినా నిర్లక్ష్యమే
రైతుల వద్ద ప్రభుత్వం సేకరించిన ధాన్యం జిల్లాలోని 30 మిల్లర్లకు సరఫరా చేశారు. దీనికి బదులుగా బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సిన బాధ్యత వారిదే. సీఎంఆర్ ఒప్పందం ప్రకారం ఏడాదిలోగా బియ్యం ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ రెండేళ్లు గడుస్తున్న మిల్లర్లు నిర్లక్ష్యం చేస్తున్నారు. 2022-23 సంవత్సరంలో జిల్లాలోని 30 రైస్ మిల్లులకు 38.613 మెట్రిక్ మెట్రిక్ టన్నుల వారి ధాన్యం అప్పగించారు. ఇందుకుగాను 25. 875 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి మిల్లర్లు సరఫరా చేయాలి. కేవలం 23వేల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించినట్లుగా తెలుస్తుంది. ఇంకా రెండువేల మెట్రిక్ టన్నుల పైచిలుకు బియ్యం ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ ఏళ్లు గడుస్తున్న రైస్ మిల్లర్ల యజమానులు జాప్యం చేస్తూ కాలం గడుపుతున్నారు.
‘కృష్ణసాయి’ అవినీతి బాగోతం
వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం చెన్నారంలోని కృష్ణసాయి రైస్ ఇండస్ట్రీ యాజమాన్యంపై సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం 1850.60 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైస్ మిల్లుకు అప్పగించింది. ఇందుకు 1239.90 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ 801 మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పగించింది. ఇటీవల పౌర సరఫరాల శాఖ అధికారులు జిల్లాలో ఏ రైస్ మిల్లు ఎన్ని మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉందో ఆ వివరాలను సేకరించారు.
ఈ క్రమంలోనే కృష్ణసాయి రైస్ మిల్ అవినీతి బాగోతం బయటపడింది. కృష్ణసాయి రైస్ ఇండస్ట్రీస్ యజమాని పై సంబంధిత అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లీజుకు తీసుకున్న వ్యక్తితో పాటు యజమాన్యంపై ఎఫ్‌ఐఆర్ చేసి రిమాండ్ కు తరలించారు. అధికారిక లెక్కల ప్రకారం ఆ రైస్ మిల్లు యాజమాన్యం ప్రభుత్వానికి నగదు రూపంలో రూ.6 కోట్లు 3 లక్షల 51000 చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కప్రకారం జిల్లాలోని 30 రైస్ మిల్లుల యజమాన్యం రికవరీ రూపంలో సుమారుగా రూ.200 కోట్లు పైగా నగదు చెల్లించాల్సి ఉందని సమాచారం.